మోపిదేవి ఫ్యామిలీకి సిఎం పరామర్శ వెనక..?

వైయస్ జగన్ ఆస్తుల కేసులో మోపిదేవి వెంకటరమణను బలి చేశారనే విమర్శలు వస్తున్నాయి. బలహీన వర్గాలకు చెందిన నాయకుడు కాబట్టే మోపిదేవిని బలి చేస్తున్నారని అంటున్నారు. ఇదే వ్యాఖ్య మోపిదేవి నుంచి కూడా వచ్చింది. తనను కేసులో ఇరికించారని, బలహీన వర్గాలకు చెందిన నాయకుడినే కాబట్టే వివక్ష చూపారని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేయడానికి ముందు కొద్ది మంది మంత్రులు అరెస్టవుతారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
జగన్‌ను మాత్రమే అరెస్టు చేయడం లేదని, తప్పు చేసినవారిని ఎవరినైనా అరెస్టు చేస్తామని చెప్పడానికి మంత్రుల అరెస్టు జరుగుతుందని, ఇది జగన్ అరెస్టు కన్నా ముందు జరుగుతుందని బాహాటంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ స్థితిలో మోపిదేవి అరెస్టు జరిగింది. దీంతో వైయస్ జగన్‌ను సానుభూతి లభించకుండా మోపిదేవిని పావుగా చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికే కిరణ్ కుమార్ రెడ్డి మోపిదేవి నివాసానికి వెళ్లినట్లు చెబుతున్నారు.
మరోవైపు, తనను అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ ప్రకటించగానే మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఓ లేఖను తన మిత్రుడి ద్వారా ముఖ్యమంత్రికి పంపించారు. మోపిదేవి రాజీనామా చేయకుండా, బర్తరఫ్ చేయాల్సి వస్తే పరిస్థితి కాస్తా ఇబ్బందికరంగా ఉండేది. తనను ఇబ్బందుల పాలు చేయకుండా మోపిదేవి రాజీనామా చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మంత్రులతో సమావేశమై మోపిదేవికి అండగా ఉంటామని కిరణ్ కుమార్ రెడ్డి వారితో ప్రకటనలు చేయించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలకు చెప్పిన తర్వాతనే కిరణ్ కుమార్ రెడ్డి మోపిదేవి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications