నాడు బాబు రేపు జగన్: జాతీయస్థాయిలో చక్రం

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెసు పార్టీ నుండి బయటపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరిట సొంతకుంపటి పెట్టుకున్న తర్వాత ఆయన భవిష్యత్తుపై రాష్ట్రమే కాకుండా జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు కూడా దృష్టి సారిస్తున్నాయి. గతంలో జరిగిన కడప, పులివెందుల, కొవూరు ఉప ఎన్నికలతో పాటు తాజా ఫలితాల పైనా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.

ఢిల్లీ గద్దెనెక్కాలనుకునే పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ కీలకమైన రాష్ట్రం. ఎపిలో 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా ఎపిని కాంగ్రెసుతో పాటు మిగిలిన పక్షాలు ప్రత్యేకంగా చూస్తాయి. తొలి నుండి ఎపిలో కాంగ్రెసు హవానే నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కాంగ్రెసు చేతికి దెబ్బ తలిగింది. టిడిపి అధికారంలో ఉండగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేశారు.

ఆ తర్వాత అదే పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే హయాంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలి, డిఎంకే అధినేత కరుణానిధి తదితరులు జాతీయ పార్టీలకు వణుకు పుట్టించిన ఘటనలు ఉన్నాయి. అయితే వారు తాము అనుకున్నవన్నీ జాతీయ పార్టీల నుండి పొందలేక బయటకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

కానీ ఎపి అందుకు భిన్నం. చంద్రబాబు ఎన్డీయే హయాంలో తాను అనుకున్నవన్నీ సాధించారని అంటారు. నాటి రాష్ట్రపతి ఎంపిక, స్పీకర్ ఎంపికతో పాటు తెలంగాణపై ఎన్డీయే నిర్ణయం ప్రకటించకుండా ఉండటానికి కారణం కూడా చంద్రబాబే అన్న వాదనలు ఉన్నాయి. అంతటి స్థాయిలో జాతీయ పార్టీలను ఎపి ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జగన్ హవా నడుస్తుందనేది ఎవరూ కాదనలేని అబద్దం.

సీమాంధ్రలో ఇప్పటికే జగన్ పాతుకుపోయారు. కాంగ్రెసు, టిడిపిలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఆయన బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ఇందుకు ఇటీవల పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇవ్వడమే నిదర్శనం. తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపి నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా టిడిపి, కాంగ్రెసులు మూడు, నాలుగో స్థానాలతో సంతృప్తి చెందాయి.

ప్రస్తుతం సెంటిమెంట్ పైన జగన్ పార్టీ నడుస్తోందని చెబుతున్నారు. అయితే సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తులోనూ ఇలాంటి జోరు మీదే ఉంటే జగన్ ఖచ్చితంగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారని అంటున్నారు. ఇటీవల ఉప ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించినప్పుడు కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ స్వయంగా వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి అభినందించారు. మరో బీహార్ ఎంపి చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిసి వెళ్లారు.

జాతీయ స్థాయిలో ఎపికి ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నందున జాతీయ పార్టీ నేతలు జగన్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ కారణంగానే మీడియా కూడా జగన్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. మరోవైపు సిపిఎం పార్టీ కూడా జగన్‌కు కాస్త అనుకూలంగానే ఉన్నదనే ప్రచారం ఇప్పటికే ఉంది. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయగలిగే సత్తా ఉన్నది కేవలం కమ్యూనిస్టులకే!

అలాంటి సిపిఎం 2014లో జగన్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ జాతీయ రాజకీయాలలో గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులా భవిష్యత్తులో కీలకంగా మారనున్నారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+