ఇన్నాళ్లూ తెలంగాణ ప్రాంతానికి, అదీ కేవలం హైదరాబాదు పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని విస్తరించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ రాయలసీమ ప్రాంతంలోని రాయచోటి నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసుకుందని అంటున్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలకు తమ పార్టీని విస్తరించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ముస్లింలు అధికంగా ఉండే ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లుగా కనిపిస్తోంది. రాయచోటిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అక్బరుద్దీన్ అక్కడి వారిని ఆకట్టుకునేలా ప్రసంగించారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏదైనా పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పిందా అంటే అది కేవలం ఎంఐఎం మాత్రమేనని చెప్పారు. ఒకవేళ విడగొట్టాలనుకుంటే రాయలసీమను తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కేంద్రానికి సూచించామని చెప్పారు. తెలంగాణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చెప్పలేదన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు.
రాయచోటిలో ఆయన జగన్, కాంగ్రెసు, టిడిపిలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. సీమలో ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని స్థాపించడంతో ఇన్నాళ్లూ అక్కడి మైనార్టీ ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్న పార్టీలకు ఆందోళన పట్టుకుంది. ఎంఐఎం కనుక బరిలోకి దిగితే గుంపగుత్తగా ఆ ఓట్లన్నీ ఆదే పార్టీకి పడతాయి. దీంతో తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని అవి భావిస్తున్నాయి. రాయలసీమలో ఇప్పటి వరకు ముస్లిం వర్గాలు కాంగ్రెసు పార్టీని ఆదరిస్తూ వచ్చాయని చెప్పవచ్చు. ఇటీవల జగన్ కాంగ్రెసును వీడి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో ఆయనకూ మద్దతిస్తున్న వారు ఉన్నారు. అయితే ఎంఐఎం అక్కడ ఆరంగేట్రం చేయడంతో, ముస్లింల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలలో గుబులు పట్టుకుందని అంటున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనున్నాయనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంట్రీ జగన్‌కు ఝలక్ ఇస్తుందా లేక కాంగ్రెస్‌కు షాక్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది.