జగన్ ఎఫెక్ట్: సోనియా మదిలో తెలంగాణ?

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు, తెలంగాణ వివాదంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, జగన్ రాజకీయంగా దూసుకుపోతున్నారని సోనియా, రాహుల్‌ను కలిసిన మెజారిటీ రాష్ట్ర నేతలు స్పష్టం చేయటం తెలిసిందే. జగన్ రాజకీయానికి అడ్డుకట్ట వేయటంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఘోరంగా విఫలమైందని ఫిర్యాదులు కూడా చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తేనే పార్టీని గాడిలో పెట్టడానికి వీలవుతందని, పరిస్థితిని చక్కదిద్దడానికి వెసులుబాటు కలుగుతుందని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా చెబుతున్నారు.
తెలంగాణలో కూడా మొదటి స్థానం కాకున్నా రెండో స్థానమైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. పరకాల ఉప ఎన్నికతో ఇది ఖాయమైపోయిందని అంటున్నారు. దీంతో తమ పార్టీ మూడో స్థానానికో, నాలుగో స్థానానికో పడిపోయే పరిస్థితి వచ్చిందని అధిష్టానం కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. యుపిఎతో ఉంటానని చెబుతూనే జగన్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టే రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.
ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీలు తమ రాష్ట్రాల్లో బలమైన పార్టీలుగా ఎదిగేందుకు అనుసరించిన దారిలోనే జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారని ఏఐసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారు కాంగ్రెసు ఓటు బ్యాంకును తన్నుకుపోయి, కాంగ్రెసుతో బేరాలు సాగిస్తున్నారు. అదే తరహా రాజకీయం జగన్ నడుపుతున్నట్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేసి లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న అనంతరం యూపీఏతోకొనసాగటంలోనే జగన్ రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది. బిజెపితో వెళ్తే మైనారిటీలు దూరమవుతారు కాబట్టే ఆయన యూపీఏతోనే ఉంటానని చెబుతున్నట్టు కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో జగన్ రాజకీయ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు రాష్ట్ర విభజన ఒక్కటే మార్గమని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం చేసుకోవడం గానీ తెరాసను విలీనం చేసుకోవడం గానీ చేస్తే ఆ ప్రాంతంలోనిపదిహేడు లోక్‌సభ సీట్లను దక్కించుకోవచ్చునని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. రాష్టప్రతి ఎన్నికల అనంతరం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలకు సూచనప్రాయంగా చెప్పిందన్న మాట కూడా వినిపిస్తోంది.
రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చలు సాగించినట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో కూడా ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటు వివాదం, జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు, రాష్ట్రంలో కాంగ్రెస్ దుస్థితిపై గవర్నర్ వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
రాష్టప్రతి ఎన్నిక ముగిసిన తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదం, రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు చేయటంపై ఒక నిర్ణయానికి వస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ తరుచూ ఢిల్లీకి రావటం, సీనియర్ నేతలతో చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications