జైల్లో జగన్: వైయస్సార్ కాంగ్రెసుకు దిక్కెవరు?

ఆరు నెలల తర్వాతనైనా కచ్చితంగా జగన్ బయటికి వస్తారా? లేక మళ్శీ ఏదో కారణంతో జైలులోనే ఉండాల్సి వస్తుందా? అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా జగన్ జైలులోనే ఉన్నట్లయితే భవిష్యత్తు ఏమిటన్న విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఇప్పటికీ కింది స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లేదు. అన్నీ తానై జగన్ పార్టీని ఇంతవరకు నడిపించారు. ఈ పరిస్థితిలో జగన్ జైలులోనే గడపాల్సి వస్తే పార్టీని సమర్ధంగా నడిపించగల సత్తా ఉన్న నాయకులు పార్టీలో ఉన్నారా? అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల తర్వాత జగన్ తప్పకుండా బయటికి వస్తారన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 2013 మార్చి 31నాటికల్లా చార్జిషీటు దాఖలు చేసి విచారణను ముగించాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ బెయిలుకు సిబిఐ చెబుతున్న అభ్యంతరం, ఆయన బయటికి వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేస్తారని సిబిఐ అభ్యంతరం చెప్పడానికి వీలుండదు. అప్పుడు జగన్‌కు తప్పకుండా బెయిల్ వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వీరోచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ జైలులో ఉన్నా పార్టీ ముందుకు నడుస్తుందని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను మట్టి కరిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్ విషయంలో కుమ్మక్కయ్యాయని ప్రజల్లో ప్రచారం చేసేందుకు తమకు మంచి అవకాశం లభించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు విజయమ్మ, షర్మిలతో జిల్లా పర్యటనలు చేయించే విషయాన్ని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. శని, ఆదివారాల్లో రెండురోజుల పాటు జరగనున్న వైయస్సార్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వారి కార్యక్రమాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇలా ఉండగా, కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తీరా ఎన్నికల నాటికి జగన్ బయటికి వస్తే దెబ్బతిన్న పులిలా పోరాటానికి దిగుతారని, రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తే కాంగ్రెస్ చిక్కుల్లో పడుతుందని, జగన్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కూడా పార్టీకి లేడని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.












Click it and Unblock the Notifications