జగన్ ఎఫెక్ట్: వైయస్ఆర్ జయంతిపై డైలామా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ వైయస్ జయంతిని జరపడంపై ఏమీ తేల్చుకోలేకపోతున్నారట. 2009లో వైయస్ మృతి అనంతరం రెండు పర్యాయాలు(2010, 2011లలో) కాంగ్రెసు ఘనంగా దీనిని నిర్వహించింది. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ గెలుపు కోసం వైయస్ అంశాన్ని ఉపయోగించుకుంది. వైయస్ క్రెడిట్ అంతా జగన్‌కే వెళుతోంది. ఇలాంటి పరిస్థితులలో వైయస్ జయంతిని కాంగ్రెసు జరుపుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం వైయస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 8న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైయస్ మృతి తర్వాత 2010లో ఆయన తొలి జయంతి వచ్చింది. అప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో ఉన్నారు. ఆ తర్వాత రెండో జయంతి(2011) సమయంలో జగన్ పార్టీ మొదటి ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. ఈసారి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు జగన్ పార్టీ సిద్ధమవుతోంది.
వైయస్ పైన చాలామంది ఓటర్లలో ఇప్పటికీ అభిమానం సడలలేదని అయితే ఆయన పేరుతో ఏ కార్యక్రమం చేపట్టిన అది అంతిమంగా జగన్ పార్టీకే లబ్ధి చేకూరుతుందనే ఆలోచనలో కాంగ్రెసు నేతలు ఉన్నారట. అదే సమయంలో పార్టీలోని వైయస్ వ్యతిరేకుల నుండి కూడా నేతలపై తీవ్ర ఒత్తిడి వస్తోందట. వైయస్ పైన అభిమానం చూపడం కాకుండా అతని హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలుగులోకి తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జయంతికి రెండు రోజులే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ ఆ ఊసే ఎత్తలేదని తెలుస్తోంది. అదే దారిలో పిసిసి ఉందని అంటున్నారు. 2010లో రాష్ట్ర సమాచారం, పబ్లిక్ రిలేషన్స్ శాఖ రవీంద్ర భారతిలో వైయస్ జయంతి రోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, నాటి స్పీకర్, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కూడా హాజరయ్యారు. అప్పుడు వారు వైయస్‌ను ఆకాశానికెత్తారు. గత ఏడాది కిరణ్ ముఖ్యమంత్రిగా వైయస్ ఫోటోకు క్యాంప్ ఆఫీసులో నివాళులు అర్పించారు. అంతేకాకుండా పంజాగుట్టలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేశారు. గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications