జంప్‌లు: చంద్రబాబుది కమ్యూనిస్టుల తీరే..

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని వీడిపోయేవారి పట్ల అనుసరిస్తున్న వైఖరి, వారిపై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయి. కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు, పార్టీ నాయకులు చేసిన విమర్శలను పరిశీలిస్తే గమ్మత్తుగా అనిపిస్తుంది. పార్టీలో అన్ని పదవులూ అనుభవించిన తర్వాత పార్టీని వీడిపోడుతున్నారని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని మోసం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు విరుచుకుపడుతున్నారు. ఏం అన్యాయం చేశానని అలా వెళ్లిపోతున్నారని చంద్రబాబు మనస్తాపానికి గురవుతున్నట్లు ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నిజానికి, పార్టీ అనేది పార్టీ అధినేత మీద మాత్రమే ఆధారపడి విస్తృతి చెందదనే విషయాన్ని మరిచిపోతున్నారు. వివిధ స్థాయిల్లో నాయకులు నిర్వహించే పాత్ర మీద, స్థానిక నాయకుల ప్రతిభ కారణంగా పార్టీ విస్తరిస్తుంది. సిద్ధాంతాలకు కట్టుబడి లేకపోయినా, భవిష్యత్తులో తనకు మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నాయకులు పనిచేస్తూ పోతుంటారు. అలాంటి అవకాశాలు తనకు రావని అనుకున్నప్పుడు, పార్టీలో అణచివేతకో వివక్షకో గురవుతున్నామనే మనస్తాపానికి గరైనప్పుడు, అవతల అంతకన్నా మంచి అవకాశాలున్నప్పుడు నాయకులు పార్టీని వీడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా పార్టీలోనే కొనసాగాలనే వాదన సరైంది కాదేమో..

దేశంలోని కమ్యూనిస్టు పార్టీల తీరు చూస్తే, చంద్రబాబు తీరు అర్థమవుతుంది. కమ్యూనిస్టులు పార్టీలో ఉన్నంత కాలం ఓ నాయకుడిని తెగ పొగిడి, ఆకాశానికెత్తుతారు. బయటి క్యాడర్‌కు ఆ నాయకుడిపై అంతా పాజిటివ్‌గానే నూరిపోస్తారు. లోలోపల రగిలి, మథనపడి, వాదనలు చేసి బయటకు వస్తే అదే నాయకుడిని ద్రోహిగా చిత్రీకరిస్తారు. ఓ మంచి నాయకుడు అకస్మాత్తుగా చెడ్డవాడు ఎలా అవుతాడో తెలియక క్యాడర్ తలలు బద్దలు కొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. దానివల్ల క్యాడర్ నిరాశకు, నిస్పృహకు గురి కావడం సహజం. దానివల్ల పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలతో పాటు నక్సలైట్ పార్టీలు కుదించుకుపోవడానికి ఇది కూడా ఓ కారణం.

అటువంటి పద్దతినే చంద్రబాబు అనుసరిస్తున్నారు. పార్టీని వీడిపోయేవారిని దుమ్మెత్తిపోయడాన్ని తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. అలా దుమ్మెత్తిపోసి ఆ నాయకుడిని పలచన చేయాలనే ఆలోచన మాత్రమే పనిచేస్తుంది. పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని గానీ పరిస్థితులకు అనుగుణంగా ఆచరణను రూపొందించుకునే అవసరాన్ని గానీ గుర్తించకపోవడం తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద లోపం.

తెలుగుదేశం పార్టీ క్రమంగా కుదించికుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆచరణలో అది కుదించుకుపోతున్న క్రమంలో నాయకులను ఇమిడ్చుకునే లక్షణాన్ని కూడా కోల్పోతోంది. దానికి కారణాలను అన్వేషించకుండా పార్టీని వీడిపోయేవారిని దుమ్మెత్తిపోయడం వల్ల ఫలితం ఏమీ ఉండదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాల్సి ఉంటుంది.

- ఎల్లయ్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+