బాబు ఎత్తుగడ: బాలయ్య వెనక్కి, లోకేష్ ముందుకి

Chandrababu strategy to promote Nara lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు, ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలు బాలకృష్ణ చేతికి వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. నారా లోకేష్‌కు అడ్డం రాకుండా బాలయ్యకు చెక్ పెట్టేందుకు ఆయన ఎత్తుగడలు వేసినట్లు సమాచారం. హరికృష్ణను దూరం చేసేందుకు బాలకృష్ణను చంద్రబాబు వాడుకున్నట్లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు తన వెంటే ఉన్నారని ప్రకటించుకోవడానికి ఇంత కాలం బాలకృష్ణను చేరదీసినట్లు వినికిడి.

తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే ఎత్తుగడలో భాగంగా బాలకృష్ణను ముందుకు రాకుండా చూస్తున్నట్లు వినికిడి. సోమవారం ప్రారంభమైన మహానాడు సందర్భంగా కుమారుడు నారా లోకేష్‌కు పార్టీకి సంబంధించి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగు యువత అధ్యక్ష పదవిని నారా లోకేష్‌కు కట్టబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే, కొన్ని జిల్లాల మహానాడులకు లోకేష్ హాజరయ్యారు. తద్వారా ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అప్పట్లో దగ్గుబాటి వెంకటేశ్వర రావును, హరికృష్ణను వాడుకున్నట్లుగానే ఇప్పుడు బాలకృష్ణను వాడుకోవడానికి చంద్రబాబు సిద్ధపడినట్లు చెబుతున్నారు. 1995లో ఎన్టీ రామారావు నుంచి అధికారం చేజిక్కించుకునే వరకు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేస్తామని మీడియా లీకులు ఇప్పించి, తాను ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు ఆయనను వదిలేశారని అంటున్నారు.

తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును మాత్రం దూరం పెట్టారు. ఆ తర్వాత హరికృష్ణను కూడా వదిలేశారు. ఆరు నెలలు పూర్తయ్యే లోగా హరికృష్ణ శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండింది. అయితే, ఆ అవకాశాన్ని చంద్రబాబు హరికృష్ణ కల్పించలేదు. శాసనసభకు పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో హరికృష్ణ ఆరు నెలల లోపే మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు బాలకృష్ణను కూడా అదే పద్ధతిలో పక్కన పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే బాలకృష్ణ పార్టీ పగ్గాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం వల్ల నారా లోకేష్‌కు ముప్పు వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దాంతో నారా లోకేష్‌ను ముందుకు తెస్తూ బాలకృష్ణను మెల్లగా వెనక్కి నెట్టే ప్రయత్నాలను చంద్రబాబు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+