ఓవైసీ బ్రదర్స్: హైదరాబాద్‌పై కాంగ్రెసు ఐడియా

కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకున్న మజ్లీస్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జత కట్టి బలం పెంచుకునే ఆలోచనలో ఉంది. ఓవైసీ బ్రదర్స్ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెసు అధిష్టానం హైదరాబాదు విషయంలో తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచన కాంగ్రెసు అధిష్టానం చేసింది. అయితే, దానివల్ల వైయస్ జగన్‌తో కలిసి మజ్లీస్ బలపడే అవకాశాలున్నాయని కాంగ్రెసు గమనించినట్లు చెబుతున్నారు. దానికి తోడు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మజ్లీస్ జగన్ సాయంతో సత్తా చాటే పరిస్థితి ఉందని తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
మజ్లీస్ తమతో తెగదెంపులు చేసుకోవడంతో కాంగ్రెసు అధిష్టానం పని తెలంగాణ విషయంలో సులువుగా మారినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు బలమైన సంకేతాలే వస్తున్నాయి. అయితే, హైదరాబాదును కొంత కాలం పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. సీమాంధ్ర రాష్ట్రం రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతారని సమాచారం.
సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించాలని కూడా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిజెపి బలం పుంచుకుంటుందని, దానివల్ల మతఘర్షణలు పెరుగుతాయని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. ఇదే మాటను ఓవైసీ బ్రదర్స్ చెబుతూ వస్తున్నారు. దీనివెనక తెలంగాణను అడ్డుకునే వ్యూహంతో పాటు బిజెపిని అడ్డం పెట్టి తన బలాన్ని పెంచుకునేందుకు మజ్లీస్ వ్యూహం పన్నినట్లు కాంగ్రెసు అధిష్టానం గుర్తించిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications