హరి రిజైన్: జగన్ నేత రాత, పురంధేశ్వరిపై డౌట్?

హరికృష్ణ భావోద్వేగంతో రాజీనామా చేశారా? లేక పార్టీ అధినేత, బాబును ఇరుకునపెట్టేందుకు చేశారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. నిజానికి ఈ నెల తొలివారంలో పార్లమెంటు ప్రారంభ సమయంలోనే సీమాంధ్ర టిడిపి ఎంపీలందరూ రాజీనామా చేశారు. ఆ రోజు హరికృష్ణ తెలంగాణకు అనుకూలంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజ్యసభలో టిడిపి సభ్యులు రోజూ నిరస న వ్యక్తంచేస్తున్నా హరికృష్ణ మాత్రం సభకు దూరంగా ఉన్నారు. ఆయన గురించి ఇతర నేతలు వాకబు చేశారట.
ఆ వారానికే మరో లేఖ విడుదల చేసి తాను ఎన్టీఆర్ తనయుడిగా సమైక్యాంధ్రకు కట్టుబడ్డానని పేర్కొన్నారు. గురువారం హఠాత్తుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాతో కలకలం సృష్టించారు. హరికృష్ణ తన రాజీనామా గురించి పార్టీ నేతలెవరితోనూ చర్చించలేదని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయం కృష్ణా జిల్లాకు చెందిన జగన్ పార్టీ నేతలకు మాత్రం ముందే తెలిసిపోయిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయట.
అంతేకాకుండా జగన్ పార్టీకి చెందిన ఓ విజయనాడ నేత ఎపిఎన్జీవోలకు ఫోన్ చేసి హరికృష్ణ రాజీనామా అంశాన్ని చెప్పారట. హరి రాజీనామా రాతకోతలన్నీ తానే రాశానని, రాజీనామా ఆమోదం పొందుతుందని, దానిని స్వాగతించాలని కూడా ఆయన ఎపిఎన్జీవోలకు ఫోన్ చేసి చెప్పారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారట. మరోవైపు ఢిల్లీలో గురువారమే మరో పరిణామం చోటు చేసుకుంది.
రాజ్యసభ నడవడానికి వీలుగా సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ టిడిపి సభ్యులను కలిసి కోరారు. జీరో అవర్‌లో మాట్లాడటానికి రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని, హరికృష్ణ రాజీనామాను మాత్రం తక్షణం ఆమోదించారని టిడిపి ఎంపీలు మండిపడుతున్నారు. దీనిపై కమల్‌నాథ్ స్పందిస్తూ 'మీకు అలాంటి అభిప్రాయం ఉంటే చెప్పండి. రాజీనామా ఆమోదంపై పునరాలోచించాలని రాజ్యసభ చైర్మన్‌కు చెబుతాను' అన్నారట. ఈ వ్యాఖ్యలతో టిడిపి ఎంపీలు మరింత విస్తుపోయారట.
'ప్రకటన కూడా పూర్తయిన రాజీనామాపై పునఃపరిశీలన చేయిస్తానని మంత్రి ఎలా చెబుతారు? ఇదంతా కాంగ్రెస్‌కు ముందే తెలిసి జరిగినట్లు కనిపిస్తోంది'' అని టిడిపి నేత సందేహం వ్యక్తం చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక అదృశ్య హస్తమున్నట్లుగా వారు భావిస్తున్నారట. హరికృష్ణ రాజీనామా వ్యవహారం వెనుక హరికృష్ణ సోదరి, కేంద్ర మంత్రి పురందేశ్వరి పాత్రపైనా టిడిపి నేతలకు అనుమానాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications