మెలికపై తర్జన: తెలం'గానం'లో గ్రేటర్ ట్విస్ట్(ఫోటోలు)
తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్రం తనకు తానుగా విధించుకున్న గడువు (జనవరి 28) దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంత నేతలు తెలంగాణ వస్తుందని చెబుతుండగా.. సీమాంధ్ర నోటి వెంట అలాంటి భయాందోళనే కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చే దిశలో కేంద్రం ఆలోచన కనిపిస్తోందని సీమాంధ్ర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంటున్నారు.
ప్రధానంగా ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన జరగదంటే జరగదు.. అని ఖరాఖండిగా చెప్పే చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్, సమైక్యవాదం బలంగా వినిపించే న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిల బుధవారం నాటి మీడియా సమావేశం కేంద్రం తెలంగాణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదనే అభిప్రాయాన్ని అందరికీ కలిగించింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే టిజి వెంకటేష్ అధిష్టానం పెద్దల తర్వాత నిన్న నిరాశగా, ముభావంగా కనిపించారు.
తెలంగాణ ఇస్తే పదహారు సీట్లు గెలిపిస్తామన్న తెలంగాణ కాంగ్రెసు నేతల వాదనకు తమ వద్ద సరైన సమాధానం లేకపోయిందని టిజి చెప్పారు. ఏరాసు అయితే ఏకంగా అప్పుడే రాష్ట్రం విడిపోయినట్లుగా మాట్లాడారు. రాయలసీమ నీటి కష్టాల గురించి ఏకరవు పెట్టారు. మంత్రి జానా రెడ్డి మీడియా సమావేశం కూడా తెలంగాణ సమస్య పరిష్కారమైనట్లుగా, తెలంగాణ వచ్చేసినట్లుగానే ఉంది. ఆయన కాంగ్రెసు పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు.
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎంపీలు కూడా అదే విజ్ఞప్తి చేశారు. అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి ఐక్యంగా ఉందామని పిలుపునిచ్చారు. సమైక్యనినాదం వినిపించి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయంటూనే.. సీమాంధ్రలో సెంటిమెంట్ తక్కువగా ఉందని, తెలంగాణలో బలంగా ఉందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాదు అసలు సమస్య
రాష్ట్రాన్ని విభజిస్తే తాము అధిష్టానాన్ని ధిక్కరిస్తామని సీమాంధ్ర నేతలు చాలామంది చెబుతున్నారు. వారికి కూడా రాష్ట్ర విభజనపై స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారు. సీమాంధ్ర నేతలైనా, తెలంగాణ నేతలైనా ఎవరి వాదన చూసినా కేంద్రం విభజనకు సుముఖంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కంతా హైదరాబాదుతోనే. ప్రస్తుతం అధిష్టానం మదిలో రాయల తెలంగాణ, రాయల ఆంధ్రతో పాటు హైదరాబాదు పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదు లేని తెలంగాణను ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలంగాణవాదులు చెబుతుండగా.. హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని, హైదరాబాదును మాత్రం ఉమ్మడి రాజధానిగా చేయాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో విభజనపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అధిష్టానం హైదరాబాదు పైన తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొత్తగా తెరపైకి హైదరాబాద్ రాష్ట్రం
విభజనపై సంకేతాలు వస్తుండటంతో హైదరాబాద్ రాష్ట్రం అంటూ కొత్తగా తెరపైకి వచ్చింది. నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి జతకలిశారు. మెదక్ జిల్లాను హైదరాబాదులో కలిపి కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు.

సీమాంద్ర, తెలంగాణ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కేంద్రం, అధిష్టానం విభజనకు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే హైదరాబాదు పైనే తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర, ప్రత్యేక హైదరాబాద్ పైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

విభజనకు సానుకూలంగా ఉందనే వార్తల నేపథ్యంలో నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. విభజన జరిగితే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జగ్గారెడ్డి మరో అడుగు ముందుకేసి మెదక్‌తో కలిపి హైదరాబాదును కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగర మంత్రులకు వంత పాడారు.

సాలూరి ఎమ్మెల్యే రాజన్న దొర ప్రత్యేక మన్య సీమ డిమాండ్ చేస్తున్నారు. విభజన అనివార్యమైతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

విభజనకు కేంద్రం, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమయంలో పలువురు హైదరాబాద్ రాష్ట్రం అంటూ తెరపైకి తీసుకు రావడాన్ని కుట్రగా తెలంగాణవాదులు అభివర్ణిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రం ఉంటే సమైక్యంగా ఉండాలని లేదంటే గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేక మన్యసీమను ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే తాము ఎందులోనూ కలవమని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మజ్లిస్ రాయల తెలంగాణకు ఓటు వేస్తోంది. అయితే హైదరాబాద్ రాష్ట్రం, ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం అనేవి తెలంగాణను అడ్డుకునేందుకు పెడుతున్న మెలిక అనేది తెలంగాణవాదుల వాదన.












Click it and Unblock the Notifications