నేతల తీరు: చంద్రబాబు పట్టు తప్పుతోందా?

Chandrababu Naidu
హైదరాబాద్: పార్టీలోని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్టు తప్పుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీని అధికార పీఠం దిశగా నడిపించడానికి చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న తరుణంలోనే పార్టీ నాయకుల తీరు అస్తవ్యస్తంగా మారిపోయింది. పార్టీలో పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్న క్రమంలో చంద్రబాబు కనుసన్నల్లోనే కొందరు నాయకులు చెలరేగిపోతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. నిజానికి చంద్రబాబుకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, కానీ పరస్పరం విమర్శించుకుంటుంటే చంద్రబాబు ఎవరినీ కాదనలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందనే అభిప్రాయం కూడా ఉంది.

పార్టీపై చంద్రబాబు పట్టు తప్పుతుందనే అభిప్రాయం ఏర్పడిందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో ఉండేది, అధికారం కోల్పోయిన తరువాత క్రమంగా పట్టు తప్పసాగింది. రెండోసారి అధికారం కోల్పోవడంతో పాటు సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల్లో నాయకులు స్వతంత్రంగా పాల్గొన్నప్పటి నుంచి పార్టీపై చంద్రబాబు పట్టు కోల్పోవడం ఎక్కువైందని సీనియర్లు చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ తరఫున కడియం శ్రీహరిని పంపడంపై మోత్కుపల్లి నర్సింహులు అలిగి చంద్రబాబు తీరును విమర్శించారు. పాదయాత్రకు దూరంగా ఉండి తన అసమ్మతిని వ్యక్తం చేశారు. దీంతో పార్టీ సీనియర్లు రంగంలోకి దిగి మోత్కుపల్లిని బుజ్జగించారు. చివరకు చంద్రబాబు మోత్కుపల్లిని పిలిపించి తెలంగాణకు సంబంధించి మోత్కుపల్లికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. చివరకు చంద్రబాబు పాదయాత్రలో ఉన్నప్పుడు సభలో ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించే బాధ్యత మోత్కుపల్లికే అప్పగించారు.

మోత్కుపల్లి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్ర నాయకులకు సంతోషం కలిగించవచ్చు కానీ తెలంగాణలో మాత్రం పార్టీకి నష్టం కలుగుతుందని టిడిపిలో తెలంగాణ ఏర్పాటును కోరుకునే నాయకులు వాదిస్తున్నారు. తెలంగాణపై పార్టీ స్పష్టమైన వైఖరితో ఉండాలని లేకపోతే ప్రజలు నమ్మరని కడియం శ్రీహరి సమావేశంలో తన అభిప్రాయం వెల్లడించారు. కొన్ని డజన్ల మంది పాల్గొనే పార్టీ సమావేశంలో ఎవరేం మాట్లాడినా బయటకు తెలియడం పెద్ద కష్టం కాదు. కానీ ఈ మాటలు కడియమే మీడియాకు చెప్పారని, పార్టీలో చీడ పురుగులు ఉన్నాయని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం కడియంకు ఆవేదన కలిగించింది. దీంతో ఆయన విశాఖ బహిరంగ సభకు హాజరు కాలేదు. అయితే, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను బుజ్జగించారు.

ఇక ఉత్తరాంధ్ర నాయకులు కొందరు పార్టీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఉత్తరాంధ్ర నాయకులకు ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ ప్రాంతానికి చెందిన నాయకులు తెలిపారు. తాము ఉమ్మేస్తే సీమాంధ్ర నాయకులు కొట్టుకు పోతారని తిట్టిన తెలంగాణ నాయకుడితో విశాఖ సభలో ఉపన్యాసం ఇప్పించడం ఏమిటని ఆ ప్రాంతానికి చెందిన నాయకుడొకరు ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, సీమాంధ్ర నాయకులను ఆయన అవమానించే విధంగా మాట్లాడారని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు కొందరు న్యాయ పోరాటానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నందమూరి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారనే అభిప్రాయం పార్టీలో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభావం వల్ల నాయకులు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. వచ్చే రెండు మూడు నెలలు కీలకమైనవి, పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినప్పుడు అసంతృప్తితో ఉన్న వాళ్లు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపవచ్చుననే అభిప్రాయం టిడిపిలో బలంగా వినిపిస్తోంది.

విశాఖలో జరిగిన పార్టీ బహిరంగ సభకు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు తదితరులు వ్యక్తిగత కారణాల వల్లనే హాజరుకాలేదని సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. అయితే, పరిస్థితి గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పినంత సరళంగా లేదని మాత్రం అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+