పిక్చర్స్: మోడీ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సెంటిమెంట్
హైదరాబాద్: కాంగ్రెసుకు భిన్నమైన సిద్ధాంత దృక్పథాన్ని ఇవ్వడానికి బిజెపి రథ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. బిజెపిని కాంగ్రెసుకు, ఇతర పార్టీలకు భిన్నంగా చూపించి, నిలబెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్‌ను, పార్టీ సిద్ధాంత భూమికను బిజెపి చాలా కాలంగా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలో మోడీ నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకోవడం ద్వారా పార్టీ మూల సిద్ధాంతంలోకి తిరిగి నాయకులను, కార్యకర్తలను నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ గురించి ఆయన ఆదివారం మాట్లాడిన మాటలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కన్నా సర్దార్ పటేల్‌ను ఉన్నతంగా చూపించే ప్రయత్నం చేశారు. నిజాం ప్రభువు నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేసిన సర్దార్ పటేల్ సెంటిమెంటును ఆయన వేలెత్తి చూపారు. పటేలే లేకపోతే హైదరాబాద్ ఏమయ్యేదో అంటూ సెంటిమెంటును రగుల్కొలిపే ప్రయత్నం చేశారు.
కాశ్మీర్ విషయంలో నెహ్రూ విధానాన్ని తప్పు పట్టారు. కాశ్మీర్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారడానికి నెహ్రూ విధానమే కారణమని ఆయన ఎత్తిచూపించే ప్రయత్నం చేశారు. హైదరాబాదులోని కేశవ మెమోరియల్ పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. తన ప్రసంగంలో ఓ స్పష్టమైన దృక్పథాన్ని అందించే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ ఏమయ్యేదో..
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏమై ఉండేదని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఆయన హైదరాబాదులోని నారాయణగూడ కేశవ మెమోరియల్ పాఠశాలలో పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

అదృష్టమన్న మోడీ
పటేల్ విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. దేశాన్ని సమైక్యం చేసిన ఘనత ఆయనదే అన్నారు. అలాంటి వ్యక్తి అందరికీ ఆరాధ్యనీయుడన్నారు. చాణక్యుడి వంటి రాజనీతిజ్ఞత పటేల్‌లో ఉందన్నారు. దేశంలోని సంస్థానాల విలీన ప్రక్రియను నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారన్నారు.

జమ్మూ కాశ్మీర్‌పై నెహ్రూ తప్పు..
దేశంలోని అన్ని సంస్థానాల విలీన బాధ్యతను పటేల్‌కు అప్పగించిన నెహ్రూ.. జమ్మూ కాశ్మీర్‌ను మాత్రం తాను చూశారన్నారు. విలీనం చేయించడంలో నెహ్రూ విఫలం చెందడం వల్లనే ఇప్పటికీ అక్కడ సమస్య రగులుతోందన్నారు. నాటి నుండి జమ్మూ వ్యాలీ సమస్యలో ఉందన్నారు.

క్రమశిక్షణగా కార్యకర్తలు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన నరేంద్ర మోడీ యువభారత్ నవభేరీ సభకు పెద్ద యెత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. వారంతా చాలా క్రమశిక్షణతో వ్యవహరించారు. ఏ విధమైన అల్లరి, వింత పోకడలు కనిపించకపోవడం విశేషం. మోడీ ప్రసంగాన్ని శ్రద్ధంగా విన్నారు.

పోటెత్తిన జనసందోహం..
బిజెపి సభకు ఇంతగా ప్రజలు కదిలి రావడం విశేషంగానే చెప్పవచ్చు. ప్రజలను పార్టీ పనిగట్టుకుని తరలించిన దాఖలాలు కూడా లేవు. మోడీ సభకు ఐదు రూపాయల ప్రవేశ రుసుం ద్వారా వసూలు చేసిన పది లక్షల రూపాయలను ఉత్తరాఖండ్ వరద బాధితులకు అందజేశారు.












Click it and Unblock the Notifications