• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉద్రిక్తతలకు తెరపడేదన్నడు?: నాగాలాండ్‌ హీట్

By Swetha Basvababu
|

కొహిమా/ ఇంఫాల్: ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల పరిధిలో అప్పుడప్పుడూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు నిరసనగా నాగాలాండ్‌లో గిరిజన తెగలు.. మణిపూర్‌లో జిల్లాల విభజనకు వ్యతిరేకంగా యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధానికి దిగాయి.

దేశమంతా మహిళలు తమకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని నినదిస్తున్నారు. పలు రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో మహిళలకు 33 % రిజర్వేషన్లు అమలుచేసినా ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. స్థానిక మున్సిపల్‌ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరిపేందుకు టిఆర్ జెలియాంగ్ ఆధ్వర్యంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌సిఎఫ్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయన ఉద్వాసనకు దారి తీసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగా తీవ్రవాద సంస్థలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మరణం ఆందోళనలు మరింత విస్తరించడానికి కారణమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసింది. కానీ ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోగా జెలియాంగ్ పదవి నుంచి వైదొలిగేందుకు ఐదునాగా గిరిజన సంస్థలు విధించిన గడువు ముగిసింది.

సిఎం జెలియాంగ్ ఇలా..

సిఎం జెలియాంగ్ ఇలా..

రెండు, మూడు రోజుల్లో వైదొలుగుతానని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ (ఎన్టీఏసీ) కన్వీనర్ కేటీ విల్లేకు లేఖ రాసిన జెలియాంగ్.. తన పదవిని కాపాడుకోవడానికి హస్తిన బాట పట్టారు. మరోవైపు ఎన్‌సిఎఫ్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం సమావేశమై అధ్యక్షుడు షుర్తోజెలీ లీజీత్సును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఒకటి, రెండు రోజుల్లో సీఎంగా జెలియాంగ్ స్థానంలో షుర్తోజెలీ లీజీత్సు నియమితులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆందోళనకు కారణాలు ఇవీ..

ఆందోళనకు కారణాలు ఇవీ..

స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి నాగాలాండ్‌ ప్రభుత్వం నిర్ణయించడం తమ సంప్రదాయాలకు వ్యతిరేకమని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈనెల ఒకటో తేదీన ఎన్నికల నిర్వహణకు జెలియాంగ్ ప్రభుత్వం సిద్ధపడడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. నాగాలాండ్‌ ట్రైబ్స్‌ యాక్షన్‌ కౌన్సిల్‌, మరికొన్ని సంస్థలు ఉద్యమం ఉద్ధృతం చేశాయి. సీఎం జెలియాంగ్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. రాష్ట్ర రాజధాని కోహిమా సహా దిమాపూర్‌లో కూడా కర్ఫ్యూ విధించారు. స్థానిక గిరిజనులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. కోహిమాలో ఆందోళనలు పెరగడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లు వ్యాప్తి చెందకుండా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. సీఎం జెలియాంగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తగులబెట్టారు. సచివాలయంతోపాటు ఏకంగా సిఎం జెలియాంగ్‌ ఇంటితోపాటు, ఆయన సన్నిహితుల ఇళ్లకు, ఎన్నికల సంఘం కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు.

ప్రజలు మా వెంట ఉన్నారని...

ప్రజలు మా వెంట ఉన్నారని...

ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తాము చేపట్టే ఆందోళనకు ప్రజల మద్దతు ఉన్నదని నాగాలాండ్ వేర్పాటువాద సంస్థలు చెప్తున్నాయి. నాగా ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని అలెజో వెనూ వ్యాఖ్యానించారు. ప్రజావాణిని నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 371 ఏ ప్రకారం నాగాలాండ్ కు ప్రత్యేక హోదా ఉన్నదని, మహిళలకు రిజర్వేషన్లు తమ సంప్రదాయానికి వ్యతిరేకమని ఆయన తెలిపారు.

ఎన్నికలకు దూరంగా స్థానిక సంస్థలు

ఎన్నికలకు దూరంగా స్థానిక సంస్థలు

నగరపాలక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అమలు చేయాలన్ననాగా మదర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థనను గిరిజన సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో గత 16 ఏళ్లుగా నాగాలాండ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. ఇక అనివార్య పరిస్థితుల్లో 2012లో నాగా మదర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. 2016లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

సుప్రీం ఆమోదించినా కూడా...

సుప్రీం ఆమోదించినా కూడా...

స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపినా గిరిజన సంఘాలు ఒప్పుకోలేదు. ఎన్నికలను రెండు నెలలపాటు వాయిదా వేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘాలు, ప్రభుత్వం మధ్య తొలుత ఒప్పందం కుదిరింది. తర్వాత ప్రభుత్వం దాన్ని తోసి రాజని ఎన్నికల నిర్వహణకు సిద్దం కావడంతో ఆందోళనకారులు నిరసనల బాట పట్టారు. అదీ హింసాత్మకంగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.

రంగంలోకి కేంద్రం...

రంగంలోకి కేంద్రం...

పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నాగాలాండ్‌ సీఎం జెలియాంగ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి గురించి ఆరా తీశారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్రమోదీని కలిసి పరిస్థితిని వివరించి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరూరు. సైన్యం, ప్రత్యేక భద్రతాబలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి కొంత సద్దుమణిగినా ఆందోళనలు ఆగలేదు.

వారికి ఎందుకీ వ్యతిరేకత

వారికి ఎందుకీ వ్యతిరేకత

స్థానిక గిరిజన సంప్రదాయాల ప్రకారం పురుషులకే పాలనాధికారం ఉండాలన్నది కొంతమంది వాదన. కాని వారి భయానికి అసలు కారణం వేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (ఎ) నాగాలాండ్‌కు ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. అక్కడి భిన్న రాజకీయ, సాంస్కృతిక నేపథ్యమే దీనికి కారణం. వారి సంస్కృతి, సంప్రదాయాల్లో కాని భూ బదలాయింపుల్లో కాని, భూ యాజమాన్య హక్కుల్లో కాని కల్పించుకోవడానికి కాని, వాటిపై పార్లమెంటు చట్టాలు చేయడానికి కాని వీలు లేకుండా రాజ్యాంగం ప్రత్యేకంగా నాగాలకు కొన్ని రక్షణలు కల్పించింది. పార్లమెంటు చట్టాలను.. ఆ రాష్ట్ర శాసన సభ తప్పనిసరిగా ఆమోదించాల్సిందే.

చట్ట వ్యతిరేకంగా ఆందోళనలు

చట్ట వ్యతిరేకంగా ఆందోళనలు

మహిళా రిజర్వేషన్లపై కూడా అసెంబ్లీ తీర్మానం చేసినా గిరిజన సంఘాలు మాత్రం ఒప్పుకోవడంలేదు. గమ్మత్తేమిటంటే 1963లో రాష్ట్రంగా నాగాలాండ్ ఏర్పాటైనప్పటి నుంచి నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాలేదంటే ఇక్కడి పరిస్థితి అవగతవుతుంది. 20 ఏళ్ల క్రితం మాత్రం ఒకే ఒక మహిళ ఎంపిగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆమె మాత్రమే రాష్ట్రంలో ఎన్నికైన తొలి, చివరి మహిళా ప్రతినిధి కావడం గమనార్హం.

జిల్లాల విభజనకు వ్యతిరేకంగా మణిపూర్‌లో దిగ్బంధం

జిల్లాల విభజనకు వ్యతిరేకంగా మణిపూర్‌లో దిగ్బంధం

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మణిపూర్‌లో సీఎం ఇబోబిసింగ్ వరుసగా నాలుగోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో రెండు జాతీయ రహదారులను దిగ్బంధించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా తమకు పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. యునైటెడ్ నాగా కౌన్సిల్ వాదన ప్రకారం తమ హక్కులు కాలరాస్తున్నదన్నదే ప్రధానం గానీ, వాస్తవమేమిటంటే తమ ఆధిపత్యానికి గండికొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని నాగాల ఆరోపణ. దీనికి బీజేపీ వ్యూహాత్మక మద్దతునిస్తోంది.

ఇబోబీసింగ్ మాజీ సహచరుల విమర్శలు

ఇబోబీసింగ్ మాజీ సహచరుల విమర్శలు

పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇబోబీ సింగ్ క్యాబినెట్ లో మంత్రులు గా పనిచేసిన వారూ బీజేపీ పక్షాన చేరి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక నాగాలాండ్‌లోనూ రాజ్యాంగం తమకు కల్పించిన ప్రత్యేక రక్షణల సాకుగా మహిళా రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం వారి ఆధిపత్యానికి తెర పడుతుందన్న ఆందోళనే తప్ప మరొక కారణమైతే కనిపించడం లేదు. నాగాలాండ్‌లో నెలకొన్న సమస్యకు పరిష్కారం ఏ రూపంలో లభిస్తుందో వేచి చూడాల్సిందే.

English summary
Nagaland, which has been on the boil in the wake of massive protests against reservation for women in local body elections, will soon get a new chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X