ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కొండెపి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా జరుగుమల్లి, మర్రిపూడి మండలాలు కొండెపి నియోజకవర్గంలో చేరాయి.1955 నుండి 2004 వరకు జనరల్ గా ఉన్న ఈ నియోజకవర్గం 2009 లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఇక్కడ నుండి ఇద్దరు మాజీ మంత్రులు పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. జివి శేషు ఇక్కడ ఒక సారి, సంతనూతలపాడు నుండి పోటీ చేసి గెలిచారు. చెన్నారెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. అదే విధంగా దామచర్ల ఆంజనేయులు రెండు సార్లు టిడిపి నుండి గెలిచి మంత్రిగా పని చేసారు. చాగంటి రోశయ్య నాయుడు రెండు సార్లు, గుండపనేని అచ్యుత కుమార్ రెండు సార్లు గెలుపొందారు. ఇక్కడి నుండి గెలిచిన పట్టాభిరామస్వామి..అచ్యుతకుమార్ లు తండ్రి-కుమారులు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది.
13 సార్లు ఎన్నికలు..
కొండెపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి నాలుగు సార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. 2004 లో ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచిన పోతుల రామారావు 2014 లో వైసిపి అభ్యర్ధిగా కందుకూరు నుండి బరిలోకి దిగారు. 2009 లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన డిఎస్‌విబి స్వామి 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండే గెలుపొందారు. వైసిపి నుండి పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ పార్టీ మారారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో కొండెపి నియోకవర్గం లో మొత్తంగా 214864 ఓట్లు ఉండగా, అందులో 182784 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన స్వామికి 92284 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ కు 86794 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది స్వామి 5440 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల తరువాత ఎమ్మెల్సీగా పని చేసి..వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ టిడిపి లో చేరారు. ఆయనకు తరువాతి కాలంలో నామినేటెడ్ పోస్టు దక్కింది. అప్పటి నుండి జగన్ ను లక్ష్యంగా చేసుకుంటూ జూపూడి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత స్వామి కి టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది.












Click it and Unblock the Notifications