అన్నకు తోడు: ప్రియాంక పొలిటికల్ ఆరంగేట్రం
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ గత రెండు మూడు రోజులుగా ప్రచారం ముమ్మరంగా సాగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆమె ప్రచారం సాగిస్తారంటూ మీడియా కోడై కూసింది. వచ్చే లోకసభ సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం సాగిస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
సోదరుడు రాహుల్ గాంధీకి తోడుగా ఆమె కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారంటూ మధ్య మధ్యలో ప్రచారం గుప్పుమనడం, చప్పున చల్లారడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా అదే జరిగింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయబోరని ఎఐసిసిసి స్పష్టం చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిఅజయ్ మాకెన్ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి పుకార్లు పుట్టించారని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా ఈ తరహా ప్రచారం కొందరు వ్యక్తులు, మరికొన్ని చానళ్ళ పనే అని ఆయన ఆరోపించారు. అమేథీ, రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాహుల్, సోనియాలు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.












Click it and Unblock the Notifications