జగన్ ఇలాకాలో ముద్రగడ: కొత్త చర్చకు తెర లేపిన కాపు నేత పర్యటన!
కడప: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమిస్తున్న కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కడపలో పర్యటించారు. విమానంలో కడప చేరుకున్న ముద్రగడకు ఎయిర్ పోర్టులోనే జిల్లాకు చెందిన కాపు నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కడపకు చెందిన కాపు నేత, న్యాయవాది గురప్ప ఇంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత నగరంలోని పలువురు కాపుల ఇళ్లకు వెళ్లారు ముద్రగడ. అక్కడ ఆయన కాపులతో గంటల తరబడి చర్చలు జరిపారు.
ఎన్‌ఆర్‌ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణను స్థానిక ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ... కాపు ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాపు ఉద్యమనేతగా తొలిసారిగా ఆయన కడపకు రావడం జరిగిందని చెప్పారు. బంధుత్వం ఉండటంతో ముద్రగడ తమ ఇంటికి మంగళవారం విచ్చేయడం జరిగిందన్నారు.

ఆ తర్వాత కాపు నేతలను వెంటబెట్టుకుని పెద్ద దర్గా, విజయదుర్గమ్మ గుడిలో పూజలు చేశారు ముద్రగడ. నగరంలోని కృష్ణా సర్కిల్‌లోని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ముద్రగడ ఆకస్మిక పర్యటనపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటికే ముద్రగడను ముందుంచి వైయస్ జగన్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శస్తున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇరకాటంలో పెడుతున్నారని ముద్రగడను తిట్టిపోశారు కూడా. అయితే, తన వెనక ఎవరూ లేరని, తాను కాపుల రిజర్వేషన్ల కోసమే ఉద్యమిస్తున్నానని ముద్రగడ పలుమార్లు స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు తన ఉద్యమం ఆగదని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆయనతో పలుమార్లు చర్చలు జరిపి, కాపులకు రిజర్వేషన్లు, కాపుల అభివృద్ధి కోసం కాపు కార్పోరేషన్‌కు రూ.1500 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చింది.
అయితే, ఆ తర్వాత కూడా కాపుల రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వానికి తరచూ గుర్తు చేస్తూనే ఉన్నారు ముద్రగడ. కాగా, కాపుల రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సొంత జిల్లా కడప పర్యటన చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications