నర్రా రాఘవ రెడ్డి: పోరు నుంచి అసెంబ్లీలోకి (పిక్చర్స్)
నల్లగొండ: నర్రా రాఘవ రెడ్డి ప్రజా జీవితం అత్యంత పారదర్శకం. ఆయన అతి సాధారణ జీవితం రాజకీయ నేతలకు ఆదర్శం. డాంబికాలు, అహంభావాలు లేని శాసనసభ్యుడిగా ఆయన పేరెన్నిక గన్నారు. జీవద్భాషను, పిట్టకథలతో శాసనసభలో తన ప్రసంగాల్లో గుప్పిస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు అత్యంత ఆసక్తిగా వినేవారు.
తీవ్రమైన విమర్శలు చేసిన సందర్భాల్లో కూడా ఆయన పరుష పదజాలం వాడిన సందర్భాలు కనిపించవు. ఆయన ఒకరి పట్ల దురుసుగా ప్రవర్తించేవారు కాదు, ఆయన పట్ల మరొకరు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా లేవు.
సిపిఎం శాసనసభా పక్ష నేతగా పనిచేసిన నర్రా రాఘవరెడ్డి నాల్గవ తరగతి వరకు చదివినా చిన్ననాటి నుండి విప్లవ భావజాలాన్ని ఒంటబట్టిం చుకున్నారు. 1945 ప్రాంతంలో మజ్దూర్ యూనియన్ కమ్యూనిస్టులో చేరిన నర్రా ఇల్లు విడిచి ముంబయికి వెళ్లి అక్కడ కూలీగా పనిచేస్తు కార్మిక హక్కుల కోసం పోరాడి కార్మిక నేతగా గుర్తింపు సాధించారు.
తల్లి మరణంతో తిరిగి ఏనిమిదేళ్లకు స్వగ్రామానికి చేరుకున్న నర్రా 1950లో సిపిఐ పార్టీ సభ్యుడిగా చేరాడు. కళాకారుడిగా, జానపద సంభాషణలు, చతురోక్తులు, సామెతలు, పిట్టకథలతో అనర్గళంగా మాట్లాడే నర్రా మాటలకు గ్రామీణులు ఆకర్షితులై ఆయనను అనుసరించారు. 1950లో సిపిఐ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన నర్రా 1959లో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

పోరాటంలో బుర్రకథలు..
తెలంగాణ సాయుధ పోరాటంలో నర్రా రాఘవరెడ్డి బుర్రకథలు చెప్పేవారు. వాటి ద్వారా ప్రజలను చైతన్యపరిచారు.

సర్పంచ్ స్థాయి నుంచి..
1964 ఎన్నికల్లో తిరిగి సర్పంచ్‌గా గెలిచిన నర్రా మరోసారి జడ్పీలో ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సిపిఎంపై అప్పటికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేత చర్యలకు పూనుకోగా 1964లో డిసెంబర్‌లో అరెస్టయిన రాఘవరెడ్డి 1966లో విడుదలయ్యారు.

తొలిసారి శాసనసభలోకి...
1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా నకిరేకల్ శాసన సభ నుండి సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేసిన నర్రా రాఘవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.కమలమ్మపై గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.

తప్పని ఓటమి..
1972లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుండి పోటీచేసిన నర్రా కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.కమలమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఐదు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రైలు మార్గం కోసం..
1973లో బీబీనగర్-నడికుడి రైలు మార్గం సాధనకు నర్రా ముఖ్య పాత్ర పోషించారు. 1975 జూన్ 25న కేంద్రం ఎమర్జన్సీ ప్రకటించిన సందర్భంలో నర్రాను అరెస్టు చేసి జైలులో పెట్టారు. అనంతరం 1977లో విడుదలయ్యారు. జిల్లాకు సంబంధించి ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు సాధనకు కృషి చేశారు.

గీత కార్మికుల కోసం...
గీత కార్మిక సంఘం, చేనేత కార్మిక సంఘం నేతగా ఆయా వృత్తిదారుల సంక్షేమానికి, గ్రామసేవకుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్మించారు.

అనారోగ్యంతో కూడా...
1972లో డయాబెటిస్, 1978లో గుండెజబ్బుకు గురైన నర్రా రాఘవరెడ్డి ఒకవైపు వైద్యం చేయించుకుంటునే పార్టీ కార్యకలాపాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం విశేషం.

స్ఫూర్తిదాయకం...
కమ్యూనిస్టు పోరాట యోధుడిగా, ప్రజానాయకుడిగా నర్రా రాఘవ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయం












Click it and Unblock the Notifications