ఎంపీల అవిశ్వాసం: అంతా గప్‌చుప్, స్పీకర్ విస్తు
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంపై లోకసభ సభాపతి మీరా కుమార్ విస్తుపోయారట. సోమవారం ఉదయం సీమాంధ్ర ఎంపీలు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నపుడు ఆమె హర్షం వ్యక్తం చేశారు. అయితే మధ్యాహ్నం రెండు గంటలకు వారు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉదయం పది గంటలకు మీరా కుమార్‌ను కలిసి లోక్‌సభ సభ్యత్వాలకు తాము ఇచ్చిన రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు తమ రాజీనామాల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఓపికతో వ్యవహరించారు.

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిపోతే తమ రాజీనామాలను ఆమోదిస్తారనే అనుమానంతో వారు తమ ఆలోచనను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. స్పీకర్ కార్యాలయం తమ రాజీనామాల ఉపసంహరణను ఆమోదించి అందుకు సంబంధించిన ఫైల్‌ను మూసి వేసినట్లు తెలుసుకున్న అనంతరం కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేసుకుని మళ్లీ స్పీకర్ వద్దకు వెళ్లారు. సీమాంధ్ర ఎంపీల తరపున సబ్బం హరి మధ్యాహ్నం రెండు గంటలకు మీరా కుమార్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందచేశారు. ఆశ్చర్యానికి గురైన మీరాకుమార్ తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు.
లోక్‌సభ సక్రటరీ జనరల్ కూడా హతాశులయ్యారు. మీరా కుమార్, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట. వారి నోటి నుండి మాట రాలేదంట. లోకసభలో అవిశ్వాస తీర్మానాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ లేదా లగడపాటి రాజగోపాల్ ప్రతిపాదిస్తారని ఎంపీలు చెప్పారు. అయితే లోక్‌సభ కార్యాలయం మాత్రం ఒకరి పేరు మాత్రమే సూచించాలని స్పష్టం చేయటంతో ఎవరు మాట్లాడుతారనేది మంగళవారం ఉదయం తెలియజేస్తామని సమాధానం పంపించారు.
లగడపాటి రాజగోపాల్ ఆదివారం రాత్రి పదకొండు గంటలకు హైదరాబాదు నుంచి వచ్చిన వెంటనే సబ్బం హరి నివాసానికి వెళ్లారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటికే చేరుకోవటంతో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. విభజనను అడ్డుకునేందుకు ఏం చేయాలనే అంశంపై సీమాంధ్ర మంత్రులు, ఎంపీలతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి రావటంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. తమవంతు ప్రయత్నంగా కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయానికి అనుగుణంగానే సోమవారం మొదట రాజీనామాల ఉపసంహరణ, ఆ తరువాత అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించటం జరిగిపోయింది. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై దేశ స్థాయిలో చర్చ జరగటం సీమాంధ్ర ఎంపీలకు సంతృప్తి కలిగించింది. లోక్‌సభలో తమ తీర్మానానికి 55 మంది ఎంపీల మద్దతు సంపాదించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో వారు పని చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఒత్తిడి వస్తున్నా వారు మాత్రం రాష్ట్ర విభజన ఆపవలసిందేనని పట్టుపడుతున్నారు. అవిశ్వాస తీర్మానమే తమ బ్రహ్మాస్త్రమని లగడపాటి చెప్పారు.












Click it and Unblock the Notifications