పవన్ ఎఫెక్ట్: జోరు పెంచుతున్న జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరంగేట్రంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. సీమాంధ్ర ప్రాంతంలో కాపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని తమ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టి పవన్ జోరును కొంత తగ్గించాలనుకుంటున్నారు.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు ఆయన వెంట నడిచారు. చిరు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశాక.. ఎన్నికల నేపథ్యంలో వారి అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నాయని అంటున్నారు. దానికి ఇప్పుడు పవన్ తోడు కావడం ఆ ప్రచారం మరింత ఊపందుకుంది.
కాపులు టిడిపితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు కూడా చూస్తున్నారని చెబుతున్నారు. అయితే, హఠాత్తుగా పవన్ జనసేన పార్టీతో ముందుకు వస్తున్నారు. అంతేకాదు ఆయన టిడిపికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు.

జగన్
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కాపులు ఇప్పటికే టిడిపి వైపు చూస్తుండటం, పవన్ ఆరంగేట్రం నేపథ్యంలో జగన్ అప్రమత్తమయ్యారు.

పవన్
ఈ నాలుగు జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మందికి ఎంపీ టిక్కెట్లు, అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారంటున్నారు. ఎక్కువ మొత్తంలో ఆ సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ నుండి బయటపడుతామని జగన్ పార్టీ స్థానిక క్యాడర్ అభిప్రాయపడుతోంది.

పవన్ కళ్యాణ్
నాలుగు లోకసభ, పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో కాపులను నిలబెట్టే అవకాశాలున్నాయట. ఇప్పటికే 8 మంది పేర్లను అసెంబ్లీకి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ టిడిపి, కాంగ్రెసుల కంటే ఎక్కువ మంది కాపులను ఈ నాలుగు జిల్లాల్లో నిలబెట్టింది.

జగన్-చిరంజీవి
కాగా, కాపునాడు ఏ పార్టీకీ అనుబంధం కాదని కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావు మంగళవారం అన్నారు. కాపులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, వారిని ప్రోత్సహిస్తూ వచ్చామన్నారు. అధిక జనాభా కలిగిన కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని చాలా కాలంగా పలు రాజకీయ పార్టీలను కోరుతూ వస్తున్నామన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కాపులకు సీట్లు రాకుండా చేయడానికి కొంతమంది కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications