సోనియాకు సవాల్: టీకి మిగిలింది 170 రోజులే..

2009 ఎన్నికల్లో మార్చి 2నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే, వచ్చే ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, అన్ని అంశాలపై రాజీ కుదిరితే 180 రోజుల సమయం అవసరం. సీమాంధ్రలో ఉద్యమాలు చెలరేగుతున్న నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకుల్లోనే ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
డిసెంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు లేదా ఫిబ్రవరి నెలలో జరిగే ఓటాన్ అకౌంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం వడివడిగా తెలంగాణ
బిల్లు ఆమోదం కోసం అడుగులు వేస్తున్నా, అసాధారణ జాప్యం జరగడం తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తెలంగాణపై నోట్ సిద్ధమైనా, కేంద్ర మంత్రిమండలి
పరిశీలనకు వెళ్లలేదు.
హైదరాబాద్‌పై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం ఒక అంగుళం కూడా ముందుకు కదలడం సాధ్యమవుతుందా అనేది కూడా మరో ప్రశ్న. హైదరాబాద్ అంశం, జలాల పంపకం, రెవెన్యూ పంపకంలో వాటా, ఉద్యోగుల అంశాలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర విభజనకు 12 దశలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, రెండుసార్లు అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్రం కోరాల్సి ఉంటుంది. ఇప్పుడు నెలకొన్న ఆందోళనల కారణంగా రాష్ట్రం ఏర్పాటుకు అనుసరించాల్సిన రాజ్యాంగ ప్రక్రియ ఇంత స్వల్ప వ్యవధిలో పూర్తవుతుందా అనే అనుమానాలకు తావు కల్పిస్తోంది.
అలా కాకుండా రాష్ట్ర విభజన ప్రక్రియ సగంలో ఆగిపోతే, సార్వత్రిక ఎన్నికల అనంతరం 2014 మే, జూన్ నెలల్లో ఏర్పడే ప్రభుత్వం పూర్తిచేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే పార్టీ ప్రభుత్వాలు, రాజకీయ సమీకరణలను బట్టి తెలంగాణ ప్రక్రియను సమీక్షించి ముందుకు తీసుకుపోవచ్చు లేదా ఆపేయవచ్చు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను 125 రోజుల్లో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం రూపొందించుకున్నట్లు చెబుతున్నారు. బిజెపి బేషరతుగా మద్దతు ఇస్తే మాత్రమే తెలంగాణ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అది ఏ మాత్రం కొలికి పెట్టినా ప్రమాదమే. కాంగ్రెసు రెంటికి చెడ్డ రేవడి అవుతుంది.












Click it and Unblock the Notifications