మోడీ ప్రత్యర్థి కేజ్రీవాల్: రాహుల్ గాంధీ థర్డ్ ప్లేస్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవికి బిజెపి నేత నరేంద్ర మోడీతో ఇప్పుడు పోటీ పడేది రాహుల్ గాంధీ కాదట, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. తాజా సర్వేలో రాహుల్ గాంధీని మూడో స్థానానికి నెట్టేసి అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానాన్ని ఆక్రమించారు.
దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్) టైమ్స్ ఆఫ్ ఇండియా - ఇప్సోసో సంయుక్తంగా చేసిన సర్వే ఫలితమిది. ఈ సర్వేను ఈనెల మూడు నుంచి ఏడో తేదీ మధ్య నిర్వహించారు. 18-45 ఏళ్లమధ్య స్త్రీ పురుషులను సర్వే చేశారు.

ఆ సర్వే ప్రకారం.. ఉత్తమ ప్రధాన మంత్రిగా మోదీయే అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు 58 శాతం మంది ఓటేయగా.. 25 శాతం ఓట్లతో రెండో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 14 శాతంతో మూడో స్థానానికి పడిపోయారు. చెన్నై, ముంబైలతోపాటు మోడీ కంచుకోట అహ్మదాబాద్‌లో కూడా ప్రధాన మంత్రి రేసులో మోదీ కంటే కేజ్రీవాలే ముందున్నారు.
ఆప్ అభ్యర్థి తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే అతనికి ఓటు వేస్తామని 44 శాతం మంది స్పష్టం చేస్తే.. మరో 27 శాతం మంది అభ్యర్థిని బట్టి ఆప్‌కు ఓటేస్తామని చెప్పారు. 23 శాతం అసలు ఓటేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో బరిలో దిగాలా అని ప్రశ్నిస్తే 81 శాతం మంది ఔనని జవాబిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే బీజేపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని 31 శాతం చెబితే.. కాంగ్రెస్‌కు నష్టమని 26 శాతం.. రెండు పార్టీలకూ నష్టమేనని మరో 26 శాతం అభిప్రాయపడ్డారు. పది శాతం మంది మాత్రం ప్రాంతీయ పార్టీలకు నష్టమని, ఏడు శాతం మంది చెప్పలేమని చెప్పారు.
ఆప్ ఇతర పార్టీలకు భిన్నమని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని 50 శాతం అభిప్రాయపడ్డారు. అయితే భిన్నమైన పార్టీయే కానీ భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చునని 26 శాతం భావించారు. ఆప్ భిన్నమైన పార్టీయే కాకుండా మిగిలిన పార్టీలను కూడా మారుస్తుందని 24 శాతం అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications