ఆ జిల్లాల్లో పెరుగుదల: తెరాస గెలుపు ఖాయమా?
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి గాలి వీచిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో బిజెపి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్నాయని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ సరళిని చూస్తుంటే తెరాస గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తెరాసకు బలంగా ఉందనుకొంటున్న జిల్లాల్లోనే ఈ పోలింగ్ శాతం బాగా పెరగడం గమనార్హం.
తెరాస బలహీనంగా ఉన్న జిల్లాల్లో పోలింగ్ శాతం తగ్గడమో లేదా నిలకడగా ఉండటమో జరిగింది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రభావం బాగా అధికంగా ఉన్న కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఈసారి ఎన్నికల్లో పెరిగిన పోలింగ్‌లో అగ్రభాగాన ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 66.83% పోలింగ్ జరిగితే ఈసారి 72.21 శాతం జరిగింది. వరంగల్ జిల్లాలో గతంలో 72.91 శాతం కాగా, ఈసారి 78.54 శాతంగా ఉంది. రెండు జిల్లాల్లోను పోలింగ్ శాతం దాదాపు ఆరు శాతం పెరిగింది.

ప్రజలు ఎటో ఓ వైపు లేదా తీవ్రమైన వ్యతిరేకతో ఉన్నప్పుడే పోలింగ్ ఎక్కువగా జరుగుతుంది! గతంలో ఇది అనేకసార్లు రుజువైంది. ఈసారి తెరాసకు అనుకూలంగా గాలి వీచిందని ప్రచారం జరుగుతోందని, పెరిగిన పోలింగ్ శాతం దీనిని రుజువు చేస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తెరాసకు ఓట్లు, సీట్లు పెరుగుతాయని అందరూ అనుకొంటున్న నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా పోలింగ్ పెరిగింది.
నల్గొండలో 75.29 శాతం నుంచి 80.17 శాతానికి, మహబూబ్‌నగర్ జిల్లాలో 69 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ రెండు జిల్లాల్లో మూడో వంతు అసెంబ్లీ సీట్లు తమ ఖాతాలో పడతాయని తెరాస వర్గాలు విశ్వసిస్తున్నాయి. తెరాస ప్రభావం తక్కువగా ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం ఈసారి పోలింగ్ తగ్గింది. హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో పోలింగ్ 53.85% కాగా ఈసారి 52. 99 శాతానికి పడిపోయింది. రంగారెడ్డి జిల్లాలో 58% నుంచి 56 శాతానికి తగ్గింది.
తెరాస బలంగా ఉందనుకొంటున్న నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం పోలింగ్ అంతగా పెరగకపోవడం మరో విశేషం. కెసిఆర్ ఎంపీగా పోటీ చేసిన మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం 75.39 శాతం నుంచి 76.84% మాత్రమే పెరిగింది. కల్వకుంట్ల కవిత ఎంపీగా పోటీ చేసిన నిజామాబాద్‌లో 70.75 శాతం నుంచి 71.51 శాతానికి పెరిగింది. తెరాస ప్రభావం బాగా తక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో పోలింగ్ నిలకడగా ఉంది.












Click it and Unblock the Notifications