జిహెచ్ఎంసి పోల్స్: టిడిపి-బిజెపి మధ్య ‘ఫ్రెండ్లీ ఫైట్’
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒకే కూటమిగా కలిసి పోటీ చేస్తున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో ఈ రెబల్స్ బెడద మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో బీ ఫారం అందని ఆశావాహులు 150 డివిజన్లలో 10కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థికి పోటీగా నిలబడుతున్నారు.
పార్టీని వీడతామని స్థానిక నాయకులు బెదిరింపులకు దిగుతుండటంతో పార్టీ నాయకత్వాలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు అంతర్గతంగా రెబల్స్‌కు మద్దతు పలికి పోటీలో నిలిచేలా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు తమ పార్టీ అభ్యర్థులకు బాహాటంగానే మద్దతు తెలుపుతున్నారు.
ఎన్నికల ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బిజెపి 63 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేశాయి.

అయితే, ఎంతో ఉత్సాహంగా నామినేషన్లు వేసిన కొందరు ఆశావాహులకు బీ ఫారాలు అందకపోవడంతో నిరాశకు, ఆగ్రహానికి గురయ్యారు. తాము కూడా రెబల్స్‌గా బరిలోనే ఉంటామని ప్రకటించారు. రెబల్స్ 10కిపైగా స్థానాల్లో బరిలో నిలవడంతో తెలుగుదేశం 92, బిజెపి 68 స్థానాల్లో పోటీకి దిగినట్లయింది.
అడిక్‌మెట్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, సుభాష్‌నగర్, జీడిమెట్ల, హబ్సీగూడ, ఉప్పల్, బీఎన్ రెడ్డి నగర్, అమీర్‌పేట్, రహ్మత్‌నగర్ మొదలైన 10 స్థానాల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. హబ్సిగూడ స్థానంలో బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమ పార్టీ అభ్యర్థిని బలపరుస్తుండగా, తెలుగుదేశం నేత టి దేవేందర్ గౌడ్ తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డారు. రెండు పార్టీల ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో దిగుతున్నారు.
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి ఈ స్థానాన్ని టిడిపికి వదిలేసేందుకు అంగీకరించలేదు. అయితే, స్థానిక టిడిపి నేతలు కూడా ఈ స్థానాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో రెండు పార్టీల అభ్యర్థులు ఇక్కడ కూడా బరిలో ఉండే పరిస్థితి ఏర్పడింది. మిగితా 8 డివిజన్లలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. ‘మేము రెండు పార్టీల అభ్యర్థులకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించాం. కానీ సాధ్యపడలేదు. టిడిపి, బిజెపి నేతలపై స్థానిక నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల అభ్యర్థులు 10 డివిజన్లలో ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్' చేస్తున్నాయి' అని తెలిపారు. రెండు పార్టీలు కూటమిగా ఏర్పడితే ఇలాంటి సమస్యలు సాధారణమేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications