లాజిక్ 'డ్రామా': కిరణ్ రాజీనామా వట్టిదేనా?

అధిష్టానం డ్రామాలో భాగంగానే కిరణ్ నడుచుకుంటున్నారని ఇప్పటికి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సీటు పదిలమే అంటున్నారు. నిజంగానే సమైక్యాంధ్రకు కట్టుబడితే కిరణ్ ఇప్పటికే రాజీనామా చేసేవారని, నిజంగానే అధిష్టాం డ్రామాలో భాగం కాకుంటే ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ముఖ్యమంత్రిని తప్పించే వారని విపక్షాలు లాజిక్ లాగుతున్నాయి. సమైక్యాంధ్ర పేరుతో ఒక్కసారిగా హీరోగా మారిన కిరణ్ అదే హీరోయిజంతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ ఓట్లు కొల్లగొట్టే అవకాశాలతో ముందుకు సాగుతారని అంటున్నారు.
విభజనకు వ్యతిరేకంగా చాలా రోజులుగా గళం వినిపిస్తున్న ఆయన తాజాగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద భారీ వౌన దీక్ష కూడా నిర్వహించారు. ఇది అధిష్టానాన్ని కదిలించింది కూడా. ఈ కారణంగానే శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కిరణ్ వైఖరిపై కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌పై వేటు వేయాలన్న ప్రతిపాదనలు కూడా ఈ భేటీలో వచ్చాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా కోర్ కమిటీ భావాన్ని అంతర్లీనంగా వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే శనివారం మళ్లీ మాట్లాడిన ఆయన కిరణ్ తప్పులేదని, కేవలం అధిష్టానం భావాలు చెప్పమంటేనే చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనిస్తే ముఖ్యమంత్రిపై వేటు ఉండదన్నది విస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అసలు రాజీనామాకు కూడా అవకాశాలు ఉండవన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీతో అడుగులు వేసేకంటే, కాంగ్రెస్‌లోనే ఉంటూ సమైక్య హీరోగా అధిష్టానాన్ని ఎదిరించిన వ్యక్తిగా జనంలోకి వెళ్లడం మేలన్న భావాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారట.
కేవలం ప్రజల్లోకి వెళ్లిన సమయంలో సమైక్యం కోసం తాను చేసిన యుద్ధాన్ని వివరిస్తే పార్టీని కూడా చూడకుండా తనకు బ్రహ్మరథం పడతారని ఆయన యోచిస్తున్నారట. మరోవైపు తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించినా, లేకున్నా బిల్లును పార్లమెంట్‌లో పెట్టిన ఘనతతో తెలంగాణలో తెరాసను కలుపుకొని పోవడం ద్వారా సీట్లు వస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. ఇక సీమాంధ్రలో కిరణ్ వ్యక్తిగత హీరోయిజంతో కాంగ్రెస్ తరఫునే పోటీ చేసినా సీట్లు వస్తాయి.
ఇదే సమయంలో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినా దాన్ని ముఖ్యమంత్రి హోదాలోనే సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఆలోచన కిరణ్‌లో ఉంది. కోర్టులో స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నా మరోసారి కిరణ్ హీరోగా మారడం ఖాయం. దీన్ని ఆసరగా తీసుకుని జనంలోకి వెళ్లడం కాంగ్రెస్‌లో ఉన్నా కూడా కిరణ్‌కు మేలు చేసేదిగానే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications