విద్యార్థినుల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు...అరెస్టయిన స్వీపర్..
ఢిల్లీ ఐఐటీలో ఓ షాకింగ్ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ఉపయోగించే వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఐఐటీలో కొనసాగుతున్న ఫెస్ట్‌లో భాగంగా శుక్రవారం ఒక ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు బట్టలు మార్చుకునేందుకు వాష్‌రూమ్‌ను ఉపయోగించారు. అయితే వాష్ రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు విద్యార్థినులు కనిపెట్టారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన భారతీ కళాశాల విద్యార్థినులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా భారతీ కళాశాల విద్యార్థినులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సీక్రెట్ కెమెరాల విషయంపై ఐఐటీ-ఢిల్లీ యాజమాన్యాలకు చెప్పినా వారు తగిన చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేసులో ఓ కాంట్రాక్టు స్వీపర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

20 ఏళ్ల కాంట్రాక్టు స్వీపర్ అరెస్టు: కిషన్ గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. 20 యేళ్ల కాంట్రాక్టు స్వీపర్‌ను ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు. ఆ నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 354సీ కింద ఈకేసును నమోదు చేసుకొని నిందితుడైన కాంట్రాక్టు స్వీపర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై తదుపరి విచారణను జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ ఐఐటి స్పందన: ఈ కేసుపై ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కూడా స్పందించింది. ఈ ఘటనను ఖండించింది. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసింది. ఎట్టకేలకు ఈ సంఘటనపై ఢిల్లీ ఐఐటి స్పందించింది. ఈ ఘటనపై ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇలాంటి ఘటనలను సహించేదే లేదంటూ, ఈ పరిస్థితి గురించి అధికారులతో చర్చించామని, ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు పూర్తి సహాకారాన్ని అందిస్తామంటూ అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications