ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రంలో ఇంకా సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. నిన్న ఒక టీవీ ఛానల్‌లో గంటన్నర సేపు కన్పించిన ఆయన చాలా లౌక్యంగా మాట్లాడారు. మార్గదర్శి హైనాన్సియర్స్‌లో తన కుటుంబ సభ్యులకు డిపాజిట్లు ఉన్నాయని, మిగితా డిపాజిటర్లకు న్యాయం చేసిన తర్వాతే తాను వాటిని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ద్వారా ఆయన తెలివిగా వ్యవహరించినట్టు పైకి కనిపిస్తోంది. ఆయన రామోజీరావు వంటి ఒక పెద్ద మనిషి మీద, ఒక పెద్ద మీడియా గ్రూపు మీద దాడి చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు ఎక్కువ మంది జనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడం రామోజీరావు నెత్తిమీద పాలు పోసినట్టు కనిపిస్తోంది. ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అతి వేగంగా ప్రతిస్పందించి ఉండేది. అలాగే డిపాజిటర్లలో పెద్దగా ఆందోళన క న్పించకపోవడం నిజంగా రామోజీరావు అదృష్టమే. డిపాజిటర్ల క్షేమమే తనకు ముఖ్యమని అందువల్లనే తాను ఇంకా తదుపరి చర్యలు కోరడం లేదని ఉండవల్లి చెప్పడంలో ఎంత నిజం ఉందో కొన్ని రోజుల తర్వాత కానీ తెలియదు. మొత్తానికి మార్గదర్శి ఉదంతం వల్ల అతి ముఖ్యమైన కరీంనగర్ ఉప ఎన్నిక విషయం ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు ఫిల్మ్ సిటీ మీద దాడి చేసిన చంద్రశేఖరరావు ఈనాడు రామోజీరావుకు అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ లోనూ ఆంధ్రలోనూ చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications