అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కూడా మీడియాపై అసంతృప్తి మొదలైంది. నిజానికి, చంద్రబాబుకు మొదటి నుంచి మీడియా అండదండలు విశేషంగా ఉన్నాయి. అయితే మీ కోసం యాత్రకు మీడియా ఇచ్చిన కవరేజీతో ఆయన సంతృప్తి చెందడం లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెండు దినపత్రికలపై పదే పదే విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం మీడియా తన మీ కోసం యాత్రకు ఇవ్వడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మీ కోసం యాత్ర సోమవారం అనంతపురంలో సాగింది. ఈ నెల 15వ తేదీన ఈ యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. ఈ నెల 15వ తేదీన జరిగేది మీ కోసం యాత్ర ముగింపు సభ కాదని, పునరంకిత సభ అని ఆయన అన్నారు. సాక్షి పత్రికపై చంద్రబాబు తన అక్కసు వెళ్లబోసుకున్నారు. సాక్షి ప్రభుత్వ అవినీతితో పుట్టిందని ఆయన విమర్శించారు. తాము నాటి మొక్క ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని, దాన్ని తన గొప్పతనంగా కాంగ్రెసు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన అన్నారు. విద్యాసంస్థలన్నీ ముఖ్యమంత్రి కడప, పులివెందులకే తెస్తున్నారని, అనంతపురానికి ఒక్క విద్యాసంస్థను కూడా తేవడం లేదని ఆయన విమర్శించారు.