దాదా సౌరవ్ గంగూలీకి భారత వన్డేల క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే ఎసరు పెట్టాడట. వన్డే జట్టులోకి గంగూలీని తీసుకోవద్దని సెలెక్టర్ల చెవులు కొరికింది ధోనీయేనని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అంటోంది. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత తన సత్తాను చాటుకుంటున్న గంగూలీని ఆస్ట్రేలియాలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో గంగూలీకి స్థానం దక్కకపోవడం సాధారణ క్రికెట్ అభిమానులను కూడా ఆశ్చర్య పరిచింది. గంగూలీ, సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ లు లేకుండా 20 ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ధోనీ పలుకుబడి పెరిగిన విషయం తెలియంది కాదు. సీనియర్లతో కలిసి ఆడడానికి ఏ మాత్రం ఇష్టపడని ధోనీ పాక్ తో జరిగిన మ్యాచులకు ద్రావిడ్ ను దూరం చేయగలిగాడని అంటున్నారు. ఇప్పుడు గంగూలీకి ఎసరు పెట్టాడని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గగ్గోలు పెడుతోంది. ఈ విషయాన్ని బిసిసిఐకి తెలియజేస్తామని బెంగాల్ క్రికెట్ అసోయేషన్ కార్యదర్శి అంటున్నాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యలేదన్నట్లు తయారైంది గంగూలీ. తనను వన్టే జట్టులోకి తీసుకోలేదని తెలిసి ఆస్ట్రేలియా టూరులో ఉన్న గంగూలీ కన్నీరు పెట్టాడట కూడా.