రామాయణంలో పిడకల వేటలా భారత క్రికెటర్లపై మరో చిన్నపాటి వివాదం చుట్టుముట్టింది. సిడ్నీలోని హోటల్ వద్ద నిలిపి ఉంచిన కారును భారత క్రికెటర్లు ప్రయాణిస్తున్న వాహన ఢీకొట్టిందనేది ఆరోపణ. ఈ సంఘటనను హిట్ అండ్ రన్ గా ప్రత్యక్ష సాక్షి వ్యాఖ్యానిస్తున్నారు. భారత క్రికెటర్లు కాన్ బెర్రాలో ప్రాక్టీస్ మ్యాచు ఆడేందుకు బయలుదేరినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అయితే అటువంటి సంఘటనేమీ జరగలేదని భారత క్రికెట్ జట్టు మేనేజ్ మెంటు అంటోంది. తాను ఆ వాహనంలోనే ఉన్నానని, తమ వాహనం దేన్నీ ఢీకొట్టలేదని భారత మీడియా మేనేజర్ ఎం.వి. శ్రీధర్ చెప్పారు. గురువారం జరిగే ప్రాక్టీస్ మ్యాచులో ఆడేందుకు భారత క్రికెటర్లు ఇప్పటికే కాన్ బెర్రాకు చేరుకున్నారు. ఈ మ్యాచులో కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆడడం లేదు. ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఆయన స్థానంలో వైస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు నాయకత్వం వహిస్తాడు.