తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ నాయకులు హైజాక్ చేస్తారనే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మూకుమ్మడి రాజీనామాల నిర్ణయాన్ని ప్రకటించారా. ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య స్థితిలో కాంగ్రెసు చిక్కుకుంది. దీంతో వీరప్ప మొయిలీ నోట ఎస్సార్సీ మాట పలికించి ప్రతిస్పందనలను రాబట్టాలని సోనియా గాంధీ అనుకుని ఉండవచ్చు. రెండో ఎస్సార్సీ వేస్తామని మొయిలీ ప్రకటన చేశారో లేదో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టారు. కెసిఆర్ కన్నా ముందుకెళ్లి వారు తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం ప్రారంభించారు. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని జి. వెంకటస్వామి కాకా పుట్టించారు. మిగతా కొంతమంది నాయకులు కూడా అదే దారి పడతామని చెప్పారు. దీంతో తెలంగాణ అంశం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతిల్లోకి పోయే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ వారు ఎప్పుడు వేడెక్కుతారో, ఎప్పుడు చల్లబడతారో తెలియదు. అందువల్ల తెలంగాణ అంశం కాంగ్రెస్ చేతుల్లోకి పోతే భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. దీంతో నిద్ర లేచిన కెసిఆర్ ఎత్తుకు పైయెత్తు వేసి రాజీనామాల నిర్ణయం ప్రకటించి పైచేయి సాధించారని అంటున్నారు. ఎంతైనా ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో కెసిఆర్ దిట్ట అని తెలిసిపోతూనే ఉంది కదా.