హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తుల దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భుజం భుజం కలిపి నడుస్తూనే ప్రజారాజ్యం నాయకులతో పొత్తుల కోసం రహస్య మంతనాలు సాగిస్తున్నారు. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుందట. అలాగే కెసిఆర్ తన నాయకులతో ప్రజారాజ్యం నాయకులతో చర్చలు కొనసాగింపజేస్తూనే తామేమీ చర్చలు జరపడం లేదని బొంకుతున్నారు. తాజాగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో తెరాస నాయకులు రామారావు, హరీష్ రావు చర్చలు జరిపారు. అది బయటకు పొక్కగానే తామేమీ చర్చలు జరపలేదని చెబుతున్నారు. అలాగే కెసిఆర్ తో ఇటీవల తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి చర్చలు జరిపారు. అలాగే అంతకు ముందు హరీష్ రావు అల్లు అరవింద్ తో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని చిరంజీవి ధ్రువీకరించారు కూడా. అయినా తామేమీ చర్చలు జరపడం లేదని తెరాస నాయకులు అంటున్నారు. మరోవైపు, వామపక్షాలు, తెలుగుదేశంలతో కలిసి తెరాస నాయకులు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా కెసిఆర్ పొత్తుల విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నారు. కలిసి వచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారా.