బాలకృష్ణ టిడిపి హీరో?

పార్టీని మళ్లీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత వ్యవహారాల్లో బాబు బిజీగా ఉన్నందున ఆయనపై పని భారం తగ్గించేందుకే బాలయ్య ఈ ప్రక్రియకు తెరలేపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబు ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతున్నప్పటికీ, కొన్ని కీలకమైన విషయాలు, జిల్లా పార్టీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల్లో అన్నీ వినే సమయంఆయనకు లేనందున, ఆ పనిని బాలకృష్ణ చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితులపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పనితీరుపై వారి స్పందన ఏమిటన్న అంశాలపై బాలయ్య ఎమ్మె ల్యేల వద్ద ఆరా తీస్తున్నట్లు సమాచారం. 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారనిచెప్పాం. వైఎస్ వర్గీయులు కూడా తమకు పనులు కావడం లేదని ఫీలవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన దానిపై ఆసక్తికరంగా విన్నారు" అని ఒక ఎమ్మెల్యే వెల్లడించారు.
అదే సమయంలో ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణ అది పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తమకు అర్ధమయిందని ఒక ఎమ్మెల్యే చెప్పారు. మరో ఏడాదిలో మునిసిపల్, ఆ తర్వాత ఏడాదిలో జడ్పీటీసీ ఎన్నికలు, అంతకంటే ముందు మరో మూడు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున వాటి ప్రచారానికి వెళ్లేందుకు బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను కూడా పార్టీ కార్యాలయంలో ఎక్కువ సేపు ఉండటం ద్వారా పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం వల్ల నేతల్లో ఉత్సాహం వస్తుందని, తాను-బాబు ఎక్కువ సేపు పార్టీ కార్యకర్తలతో గడపటం వల్ల వారిలో ఆత్మీయ భావన కూడా కలుగుతుందని బాలయ్య యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఎలాంటి హోదా లేకుండా వాటిలో పాల్గొనడం సరైనది కాదని భావిస్తున్న బాలయ్య.. భవిష్యత్తులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, సెక్రటరీ జనరల్ పదవి గానీ తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటివరకూ సెక్రటరీ జనరల్ హోదా లేనందున..ఒకవేళ బాలయ్య కోరుకుంటే ఆ పదవి సృష్టించే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications