సినీ హీరో రాజశేఖర్ భార్య, ఒకప్పటి నటి జీవితకు రోజా భయం పట్టుకుంది. ఇప్పటికే కాంగ్రెసులో తన ప్రాభవం తగ్గిందని ఆవేదనతో జీవిత ఉన్నట్లు సమాచారం. ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని రాజశేఖర్ ప్రకటించడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. రోజా ప్రవేశంతో జీవిత కాంగ్రెసుకు పనికి రాకుండా పోయే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. జయసుధ కన్నా కూడా రోజాకు ప్రాముఖ్యం లభించవచ్చునని అంటున్నారు. వాక్చాతుర్యం, రాజకీయానుభవం రోజాకు కలిసి వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు పడిన రేణుకా చౌదరి జాతీయ రాజకీయాలకే పరిమితం కావడంతో అటువంటి మహిళా నేత అవసరం కాంగ్రెసుకు పడినట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భావించి రోజాను కాంగ్రెసులోకి రప్పించే యత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. రోజా రాక వల్ల తెలుగుదేశం పార్టీపై దెబ్బ పడడమే కాకుండా తమకు లాభం జరుగుతుందని, దీనివల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. గంగా భవాని ఎంతగా మాట్లాడినా అంత హైప్ రావడం లేదని, ఆమె మాటలకు విలువ లభించడం లేదని, అందువల్ల మహిళా కాంగ్రెసు నేతగా రోజా బాగా పనికి వస్తారని అనుకుంటున్నట్లు సమాచారం.