హైదరాబాద్: శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య వ్యవహారం అలాగే ఉందని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి టెలివిజన్ చానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోశయ్య హాజరు కావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి రోశయ్యకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిలో వార్తా కథనాలు కూడా రావడం లేదు. జగన్ కు, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాస్తున్న సమయంలోనే రోశయ్య ఆంధ్రజ్యోతికి సన్నిహితంగా వ్యవరించే పద్ధతిలో వ్యవహరించడం జగన్ శిబిరానికి కంటగింపుగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇది అవసరార్థం కుదిరిన అవగాహనే తప్ప ప్రత్యేకంగా ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం కాదని అంటున్నారు. జగన్ వర్గం దిగి వస్తే తన పదవి ఖాయమవుతుందనే ఉద్దేశంతోనే రోశయ్య ఆంధ్రజ్యోతి పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని అంటున్నారు. అదే రీతిలో తమ ప్రధాన లక్ష్యం జగన్ కాబట్టి రాధాకృష్ణ రోశయ్యకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. ఇరువురి అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా ఏర్పాటు వల్ల ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో భాగంగానే అలాంటి ప్రచారం జరుగుతోందనే మాట కూడా చలామణిలో ఉంది. జగన్ ను లొంగదీయడం కూడా కాంగ్రెసు అధిష్టానం అవసరం కాబట్టి రోశయ్య వ్యవహారాన్ని తప్పు పట్టడం లేదని చెబుతున్నారు. ఏమైనా, రాజకీయాల్లో ఎప్పుడు ఎవరేమవుతారో, ఎటువంటి జతలు కడతారో చెప్పడం కష్టమే.