తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంపై దివంగత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. రామచంద్రారెడ్డి, మాణిక్యవర ప్రసాద్ వంటి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్ తీరు కూడా ఒక రకంగా అదే తీరులో ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను పక్కన పెట్టి జెడ్పీటిసి ఎన్నికలపై జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షులకు ఫోన్లు చేసి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వాన్ని బేఖాతరు చేస్తూ ఆయన సొంత బలాన్ని, బలగాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. తనకు ఇంత మద్దతు లభిస్తున్న పరిస్థితిలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది. పార్టీ అధిష్ఠాన వర్గం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా లేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చకు పాదులు పడ్డాయి. తాడోపేడో తేల్చుకుందామనే పద్ధతిలోనే ఇప్పటి వరకు జగన్ లాబీ వ్యవహారం నడుస్తోంది. ఏమైనా అటు అధిష్ఠాన వర్గానికి, ఇటు జగన్ కు ఇది సందిగ్ధ కాలమే.