ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది టాలీవుడ్ ఆసక్తిగా చర్చించుకుంటోంది. చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కడమంటే అదృష్టం తన్నుకుని వచ్చినట్లే. చిరంజీవి వెయిట్ కి తగ్గ హీరోయిన్ దక్షిణాదిన ఎవరున్నారనే చర్చ పెద్ద యెత్తున జరుగుతోంది. హీరోయిన్లంతా మరీ బక్క పలచగా ఉండి చిరంజీవి ముందు తేలిపోతారని అంటున్నారు. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఐశ్వర్య రాయ్ కొల్లగొట్టబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రజనీకాంత్ రోబోలో హీరోయిన్ గా నటించి సంచలనం సృష్టించిన ఐశ్వర్య చిరంజీవితో నటించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వయసు పెరిగినా తరగని అందంతో మిసమిసలాడుతున్న ఐశ్వర్య చిరంజీవి హీరోయిన్ గా సరిగ్గా అతుకుతుందని అంటున్నారు. ఐశ్వర్య రాయ్ రజనీకాంత్, మోహన్ లాల్ వంటి దక్షిణాది సూపర్ స్టార్ల పక్కన నటించింది. చిరంజీవితో నటిస్తే ఆ వరుస పూర్తవుతుందని భావిస్తున్నారు. రోబో చిత్రం చూసిన తర్వాత చిరంజీవి తన 150వ చిత్రం ఆ స్థాయిలో ఉండాలని భావిస్తున్నారు. అన్ని విభాగాల్లో రోబో చిత్రం తన సత్తాను చూపించింది. తన చిత్రం అంతకన్నా బాగుండాలని చిరంజీవి ఆశించడంలో తప్పు లేదు. అందుకే, దర్శకుడిగా శంకర్ ఉంటే బాగుండేదని కూడా ఆయన మనసులో మాట. అయితే, ఐశ్వర్య రాయ్ ని తన హీరోయిన్ గా తెచ్చుకోవాలని ఆయన అనుకున్నారట. ఇంకేం, ప్రారంభానికి ముందే చిరంజీవి సినిమా మరో క్రేజ్ అవుతోంది.