సినిమాటోగ్రఫీ మంత్రి జె. గీతారెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ మండిపడుతున్నారు. మరో నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. సినీ పైరసీని అరికట్టాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. పనిలో పనిగా అల్లు అరవింద్ గీతారెడ్డిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన బృందావనం పైరసీ సిడీలను, డివిడిలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పట్టుకున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజా నటించిన ఆరెంజ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ స్థితిలో అల్లు అరవింద్ దిల్ రాజుతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పైరసీని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గీతా రెడ్డి హామీలు ఇస్తారు తప్ప అమలు చేయబోరని అల్లు అరవింద్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అల్లు అరవింద్ కు చెప్పారట. ఆయన మాత్రం అంతకన్నా ఎక్కువ ఏం చేయగలరని అనుకుంటున్నారు.