తన అల్లుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వంశీకి జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ శాసనసభ టికెట్ అడగ్గా చంద్రబాబు సర్ది చెప్పి లోకసభ టికెట్ ఇచ్చారు. అయితే వంశీ ఓడిపోయారు. ఇటీవల విజయవాడ రాజకీయాల్లో వంశీ పేరు పదే పదే వినిపిస్తోంది. కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూతో ఆయన కయ్యానికి కాలు దువ్వారు. వల్లభనేని వంశీ విజయవాడ రాజకీయాల్లో ముఖ్య నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థితిలో ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు తెలుగుదేశం దేవినేని ఉమామహేశ్వర రావు కూడా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమా మహేశ్వరరావు వంశీ ప్రత్యర్థి నెహ్రూతో చేతులు కలిపారని అంటున్నారు. అంతేకాకుండా, వంశీపై చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారట. ఉమా మహేశ్వరరావుపై అత్యంత అనురాగం కలిగిన చంద్రబాబు వంశీని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. వంశీ దివంగత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరుడు కూడా. వంశీ చంద్రబాబు బావమరిది, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు అత్యంత సన్నిహితుడు కూడా. వంశీని కట్టడి చేయాలనే చంద్రబాబు నిర్ణయం హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు కోపం తెప్పిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.