ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ మనసంతా రోబో దర్శకుడు శంకర్ పైనే ఉందట. తన 150వ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తే బాగుండునని ఆశపడుతున్నారని తెలుస్తోంది. అయితే, శంకర్ కు వీలవుతుందా, కాదా అనేది ఓ సమస్య అయితే తగినంత సమయం శంకర్ కేటాయించగలరా లేదా అనేది మరో సమస్య. దీనిపై చిరంజీవి తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ షెడ్యూల్ తన ఇష్టప్రకారం ఉండాలి గానీ దర్శకుడి ఇష్టప్రకారం కాదనేది ఆయన అభిమతం. అందువల్ల అందుకు అనుగుణంగా శంకర్ ఉండగలరా, లేదా అనేది పెద్ద సమస్య. కాగా, చిరంజీవి మరో ఇద్దరు దర్శకుల గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఠాగూర్ సినిమా దర్శకుడు వివి వినాయక్ ముందు వరుసలో ఉన్నాడు. ఠాగూర్ సినిమాపై అంచనాలను సాధించడంలో వినాయక్ సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు. అలాగే, చూడాలని ఉంది సినిమాకు దర్శకత్వం వహించిన గుణశేఖర్ పేరును కూడా చిరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదంతా డిసెంబర్ లో ఓ కొలిక్కి రావచ్చునని తెలుస్తోంది. డిసెంబర్ లో రామచరణ్, చిరంజీవి కూర్చుని కథను ఫైనలైజ్ చేస్తారట.