స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు అధిష్టానానికి ఓ తురుపు ముక్క. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆమెను సమర్థంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు సాగుతున్నట్లు వినికిడి. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను చంద్రబాబుకు దూరం చేయగలిగితే కాంగ్రెసు పార్టీ చాలా వరకు విజయం సాధించినట్లే. అంతేకాకుండా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని చీల్చడానికి ఓ కేంద్ర మంత్రి బంధువు ద్వారా ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా, ఆ కేంద్ర మంత్రి పురంధేశ్వరి అయి వుండవచ్చునని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో గానీ శాసనసభ్యులతో గానీ మాట్లాడగలిగే వెసులుబాటు పురంధేశ్వరి వర్గానికి మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు సన్నిహితులు చాలా మందే ఉన్నారు. తెలుగుదేశంలో దగ్గుబాటి, చంద్రబాబు వర్గాలున్నప్పుడు దగ్గుబాటి వైపు ఉన్నవారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పార్టీని చీల్చడానికి వారిని ఉపయోగించుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఏమైనా, చంద్రబాబుకు పురంధేశ్వరి నుంచే పెద్ద గండం ఉందని రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు.