ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీకు శత్రుత్వం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకే వంశీని ఆయన తన విజయవాడ పర్యటనలో కలుసుకోలేదని చెబుతున్నారు. రక్తచరిత్ర సినిమా విషయంలో వల్లభనేని వంశీ రామ్ గోపాల్ వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి అనుచరుడైన వంశీ రక్తచరిత్ర సినిమా తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని వంశీ తవ్విపోస్తారనే భయంలో వర్మ వంశీని కలుసుకోలేదని చెబుతున్నారు. బెజవాడ రౌడీలు సినిమాకు స్క్రిప్టు రెడీ చేస్తున్న వర్మ కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. చాలా సేపు ఆయనతో మాట్లాడారు. కానీ వంగవీటి రంగాకు చెందిన మనుషులను గానీ కుటుంబ సభ్యులను గానీ ఆయన కలుసుకోలేదు. దీంతో వంగవీటి రంగా వర్గం వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో వంగవీటి రంగాను విలన్ గా చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్న వర్మ కావాలనే రంగా వర్గానికి దూరంగా ఉన్నట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది.