వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి బయటకు రావడంతో సాక్షి డైలీకి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. తమ పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుందని, తమకు మంచి రోజులు ఉంటాయని సాక్షి ఉద్యోగులు సంబరపడిపోతున్నారట. అధికార పక్షం వైపు ఉన్న పత్రికల కన్నా ప్రతిపక్ష పాత్ర పోషించే పాత్రలకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ప్రతిపక్ష పాత్రనే ఎప్పుడూ ఇష్టపడతారు. వైయస్ జగన్ కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధపడ్డారు. తన ఒంటికి పడని పోరాటానికి జగన్ సిద్ధపడ్డారు. దీంతో ప్రజా సమస్యలను సాక్షి దినపత్రిక పట్టించుకుని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇటీవలి కాలంలో హైదరాబాదులో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెరిగినట్లు లెక్కలు కూడా చెబుతున్నాయి. ఇందిరా క్రాంతి పథం యానిమేటర్స్ పై పోలీసులు బుధవారం పైశాచికంగా వ్యవహరించారంటూ సాక్షి దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది. లేడీ కానిస్టేబుళ్లు మహిళా ఆందోళనకారుల జాకెట్లు చించిపారేశారని, చీరలు లాగేశారని ఫొటో సాక్షాలతో ఆ వార్తను సాక్షి ప్రచురించింది. ఇటువంటి వార్తలు పాఠకులను ఆకట్టుకుంటాయి. వైయస్ జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ సాక్షి దినపత్రిక మాత్రం ఏదో మేరకు సర్క్యులేషన్ పెంచుకునే అవకాశాలు మాత్రం పెరిగాయి.