తమ పార్టీ అధిష్టానంపై ధిక్కారం ప్రకటించిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మద్దతు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇటీవల కృష్ణా జలాలను తీసుకుని వెళ్లి పులివెందులలో స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ చానెల్ లో జగన్ కు మద్దతుగా కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు. జగన్ పై కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్య తీసుకుంటుందా అని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెసు పార్టీ ఎవరిని కూడా బయటకు పంపించదని, జగన్ కూడా పంపిస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెసుతో వెళ్లి తిరిగి కాంగ్రెసులోకి వచ్చిన విషయాన్ని ఆయన బుధవారం ప్రసారమైన టీవీ చానెల్ లో గుర్తు చేశారు. వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. అంటే, పార్టీపై ధిక్కార స్వరం వినిపించినా జగన్ చివరికి ఇందులోనే ఉండాల్సి వస్తుందనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైందా అనేది కూడా ఓ అంశమే. తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయంలో ఇద్దరిదీ ఒక్కటి దారి కాబట్టి లగడపాటి వైయస్ జగన్ కు మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.