ఉప ముఖ్యమంత్రి విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనలకు బ్రేక్ పడినట్లే ఉంది. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉంటుందని చెప్పి తనకు అత్యంత సన్నిహితుడైన దామోదరం రాజనరసింహకు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని చూశారు. అయితే, అనూహ్యంగా కె. జానారెడ్డి పేరు ముందుకు వచ్చింది. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి పేరు కూడా ముందుకు వచ్చింది. జానారెడ్డి సీనియర్ కావడం, హోం శాఖ ఆయనకే దక్కే పరిస్థితి ఉండడం వంటి కారణాల వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనే అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జానారెడ్డికి హోం శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. హోం మంత్రే ఉప ముఖ్యమంత్రి అవుతారనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జానారెడ్డిని ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆశీస్సులు జానారెడ్డికి దండిగా ఉన్నాయి.