ప్రముఖ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద ఇప్పటి వరకు మచ్చ లేని రాజకీయ నాయకురాలిగా కనిపిస్తూ వచ్చారు. ఆమె రాజకీయ జీవితంపై ఏ విధమైన ఆరోపణలు లేవు. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలనే పద్ధతిలో ఆమె వ్యవహరిస్తూ వచ్చారు. దాన్ని ఆమె ఎంజాయ్ చేస్తూ వచ్చారని కూడా చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయ జీవితంపై మచ్చ పడింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన విషయం దాన్ని తెలియజేస్తోంది. న్యూఢిల్లీలో ఆమె ఖరీదైన ఐటిడిసి హోటళ్లలో బస చేసినందుకు బాకీ పడ్డారట. ఈ హోటల్లో బస చేస్తే రోజుకు 4 వేల రూపాయల బిల్లు పడుతుంది. అలా బస చేసినందుకు జయప్రద దాదాపు ఆరు లక్షల రూపాయలు బాకీ పడ్డారు. దీనిపై ఐటిడిసి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు పంపింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, జయప్రదనే చెల్లించాల్సి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. కాగా, ఇందులో జయప్రద ఒక్కరే లేరట. రాష్టానికి చెందిన నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా ఉన్నారు. ఆయన జయప్రద కన్నా ఎక్కువే తిన్నారు. ఆయన లక్షా 75 వేల రూపాయలు బాకీ పడ్డారు.