ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుకు కాంగ్రెసుకు పడదనే విషయం అందరికీ తెలుసు. కానీ రామోజీ రావును కాంగ్రెసు నాయకులు కూడా పొగడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై రామోజీ రావు పత్రికాముఖంగా చేస్తున్న యుద్ధం కొంత మంది కాంగ్రెసు నాయకులకు సంతోషాన్ని ఇస్తోంది. ఆలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నవారిలో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర రెడ్డి ఉన్నారు. వైయస్ జగన్ కు 600 ఎకరాల ఖనిజ నిక్షేపాల భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసినందుకు జెసి దివాకర్ రెడ్డి రామోజీరావును కొనియాడారు. అటువంటి అక్రమాలను ఈనాడు మరింతగా వెలికి తీయాలని కూడా అన్నారు. జగన్ కు చెందిన సరస్వతి సంస్థ అక్రమాలపై ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపించాల్సిన అవసరం లేదని, మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఆ అక్రమాలను బయటకు తీస్తోందని ఆయన అన్నారు. శత్రువు శత్రువు మిత్రుడు అంటే ఇదే కాబోలు. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు, వైయస్ జగన్ బద్ధ శత్రువులు. కాంగ్రెసుకు ఈనాడు దినపత్రికకు పడదు. అయినా, జెసి దివాకర రెడ్డి రామోజీరావును ప్రశంసించారంటే అదే అనుకోవాల్సి ఉంటుంది.