జూనియర్ ఎన్టీఆర్ కు కుల సమస్య వచ్చి పడింది. ఏది చేస్తే ఏం సమస్య వస్తుందో తెలియని ప్రస్తుత తరుణంలో అటువంటి వివాదం కొత్తేమీ కాదు. బృందావనం సినిమా విషయంలో ఆయన ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. సినిమాలో కొన్ని దృశ్యాలపై యాదవులు భగ్గుమంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడిని అవమానించే విధంగా సినిమాలో కొన్ని దృశ్యాలున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలను తొలగించాలని వారు పట్టుబడుతున్నారు. లేదంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. బృందావనం సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది. వివాదం ఆ సినిమా విడుదలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు గానీ విడుదలకు ముందే ఇటువంటి వివాదాలేమిటా అనిపించక మానదు. సినిమానే విడుదల కాలేదు, అందులో శ్రీకృష్ణుడిని అవమానించిన దృశ్యాలేం ఉన్నాయో ఎలా తెలుస్తుందని ముక్కున వేలేసుకోవద్దు. అదో పబ్లిసిటీ స్టంట్ కావచ్చునని సరిపెట్టుకుంటే పోతుంది.