తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనే చక్రం తిప్పుతున్నారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలోని వివిధ వర్గాలను కూడగట్టడంలో ఆమె బిజీగా కాలం గడుపుతున్నారు. ఒక్కో రంగం నుంచి ఇద్దరు, ముగ్గురిని కూడగట్టి ఆమె ఆయా రంగాలపై తన ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ మద్దతు కూడా ఆమెకు సంపూర్ణంగా లభిస్తున్నట్లు సమాచారం. మహిళలు, ముస్లింలను తెలంగాణ ఉద్యమంలోకి తెచ్చేందుకు ఆమె నిరంతరం ఓ ప్లాన్ ప్రకారం పని చేస్తున్నట్లు వినికిడి. ఆమె మాట ప్రకారమే కెసిఆర్ ఎవరిని ముందు వరుసలో పెట్టాలి, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేదాన్ని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో కూడా ఆమె మాటనే చెల్లుబాటు అవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఉద్యమంలోకి రావడానికి సోదరుడు కెటి రామారావు నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కున్న ఆమె ఇప్పుడు దాన్ని అధిగమించినట్లు చెబుతున్నారు.