కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అమెరికాను లూటీ చేశారా. అవునంటున్నారు ఆంధ్ర మేధావుల ఫోరం ప్రతినిధి చలసాని శ్రీనివాస్. కోస్తాంధ్రులు హైదరాబాదులో సెటిల్ కావడంపై మధు యాష్కీ చేసిన కామెంట్స్ పై ఆయన కొత్త వాదనను ముందుకు తెచ్చారు. సీమాంధ్రులు తెలంగాణను దోపిడీ చేస్తున్నారని, తెలంగాణ ప్రజల ఉద్యోగాలనూ భూములనూ కొల్లగొడుతున్నారని మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు కడుపు మంట పుట్టించాయి. పలువురు తెలంగాణ నాయకుల పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని, అక్కడ సెటిల్ అయ్యారని చలసాని శ్రీనివాస్ అంటూ వారు అమెరికాను దోపిడీ చేయడం లేదా అని ఆయన అడిగారు. అంతెందుకు, మధు యాష్కీ చేసిన నిర్వాకమేమిటని ఆయన అడిగారు. ఆయన చాలా ఏళ్లు అమెరికాలో ఉన్నారని, కోట్లాది రూపాయలు సంపాదించి భారత్ లో పెట్టుబడులు పెట్టారని, అది లూటీ కాదా అని ఆయన అన్నారు. అది అమెరికాను వెన్నుపోటు పొడవమేనని ఆయన వాదిస్తున్నారు. తెలంగాణ నాయకులు తమ పిల్లలను అమెరికాను దోచుకోకుండా ఎందుకు వెనక్కి రప్పించరని ఆయన అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధు యాష్కీ నిర్వహిస్తున్న కీలకమైన పాత్రకు సీమాంధ్రులు మండిపడుతున్నారని చెప్పడానికి చలసాని శ్రీనివాస్ వాదన మంచి నిదర్శనం.